పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా కీలక విషయాలు వెల్లడించింది. ఈ ప్రతిష్టంభన వ్యవహారంలో చైనాకు వారి కమాండరే ఊహించని షాకిచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపింది.
"పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో చైనా ఉద్దేశపూర్వకంగా భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని అమెరికా విశ్వసిస్తోంది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. అక్కడి బలగాలు సమర్థంగా నిలువరించినట్లు తెలిపింది. భారత బలగాలతో వాగ్వివాదం జరిగిన సమయంలో చైనా స్థానిక కమాండర్ వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. అయితే, చైనా నాయకత్వం అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవటం.. ఆ దేశానికి షాకిచ్చింది" అని అమెరికా వివరించింది.
అన్నింటికీ సిద్ధంగా భారత్..
చైనాను సమర్థంగా నిలువరించి భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని అమెరికా వెల్లడించింది. అయితే, చైనా ఎటువంటి చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
1962 నుంచి..
భారత్, చైనా మధ్య తొలిసారి 1962లో విభేదాలు తలెత్తి యుద్ధానికి దారితీశాయి. ఇది కూడా లద్దాఖ్‌కు సంబంధించిన వివాదం కావటం గమనార్హం. అసంపూర్తిగా జరిగిన సంధితో అప్పటి వివాదం ముగిసింది. అయితే, రెండు దేశాల మధ్య కచ్చితమైన సరిహద్దు లేకపోవటం వల్ల.. అప్పుడప్పుడూ ఘర్షణ వాతావరణం నెలకొంటూ వస్తోంది.
సరిహద్దు ఉద్రిక్తతలపై పరస్పరం నిందించుకుంటున్నాయి భారత్, చైనా. అదే సమయంలో ప్రతిష్టంభన ముగింపునకు చర్యలు చేపడుతున్నాయి. అయితే, తాజా వివాదంపై ఇప్పటి అనేక సార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగినా.. పూర్తి పరిష్కారం మాత్రం లభించలేదు.
ఇదీ చూడండి: భారత్- చైనా సరిహద్దుల్లో 'కెమెరా' యుద్ధాలు