చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకవ్వడం వల్లే కొవిడ్ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని అమెరికా ప్రభుత్వ అధీనంలోని లారెన్స్ లివర్‌మోర్ జాతీయ లేబోరేటరీ 2020 మే నెలలోనే నిర్ధరించినట్లు సమాచారం. దీనిపై మరింత లోతైన విచారణ జరపాలని కూడా ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన నివేదికలోని కీలక అంశాలను తాజాగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.
లారెన్స్ లివర్‌మోర్ నివేదిక ఆధారంగానే ట్రంప్ శ్వేతసౌధంలో తన చివరి రోజుల్లో విదేశాంగ శాఖను విచారణకు ఆదేశించారని కథనంలో పేర్కొంది. తాజాగా అధ్యక్షుడు బైడెన్ సైతం వైరస్ మూలాలను వీలైనంత త్వరగా ఛేదించాలంటూ నిఘా సంస్థలను ఆదేశించడంతో ఈ నివేదిక తెరపైకి వచ్చింది. ల్యాబ్ నుంచి వైరస్ ప్రమాదవశాత్తూ లీక్ అయ్యిందా లేక వైరస్ సోకిన జంతువు నుంచి మనిషికి సోకిందా అన్న రెండు అంశాలపై అమెరికా నిఘా సంస్థలు విచారణ జరుపుతున్నాయని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు.
లారెన్స్ లివర్‌మోర్‌లోని నిఘా విభాగమైన 'జెడ్ డివిజన్' వైరస్ లీక్ అంశంపై అధ్యయనం చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. సార్స్-కొవ్-2 వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందన్న వాదన ఆమోదయోగ్యమైనదేనన్న నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. చైనాలోని ల్యాబ్ నుంచి లీకవ్వడం వల్లే కరోనా మహమ్మారి ఉద్భవించిందన్న వాదనపై అమెరికా ప్రభుత్వం జరిపిన తొలి విచారణ ఇదేనని సమాచారం. ఈ నివేదిక అక్టోబర్‌లో విదేశాంగ శాఖ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ల్యాబ్ లీక్ వాదన బలహీనపడింది. సరిగ్గా అదే తరుణంలో ఈ విచారణ ఫలితాలు వెలుగులోకి రావడంతో విదేశాంగ శాఖ దీనిపై దృష్టి సారించింది. వీటి ఆధారంగానే వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యి ఉంటుందన్న వాదనకు బలం చేకూరుస్తూ మరికొన్ని ఆధారాలను విదేశాంగ శాఖ జనవరి 15న ఓ నివేదికను బయటకు తెచ్చింది.