ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షల 62 వేలు దాటగా.... 76 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వ్యాధి సోకిన వారిలో 2 లక్షల 93 వేల మందికిపైగా కోలుకున్నారు. స్పెయిన్‌లో ఈ ఒక్కరోజే 457 మంది చనిపోగా.. బెల్జియంలో 403 మంది మరణించారు.
మృత్యుఘంటికలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. వైరస్ ధాటికి ఐరోపా దేశాలు కుదేలవుతున్నాయి.
స్పెయిన్: ఈ ఒక్కరోజే 3,800కుపైగా కేసులు నమోదయ్యాయి. 457 మంది మరణించారు. స్పెయిన్‌లో రోజువారీ కరోనా మరణాల రేటు వరుసగా నాలుగు రోజులు పడిపోయిన తరువాత.. మంగళవారంనాడు 743కు పెరగడం గమనార్హం. మొత్తంగా ఆ దేశంలో కరోనా మరణాలు 13,798కి చేరుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
బెల్జియం: ఇవాళ ఒక్కరోజే అక్కడ 403 మంది మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 2,035కు చేరింది. బెల్జియంలో కొత్తగా 1,380 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటింది.
ఇరాన్: ఇవాళ కొత్తగా 133 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,872కు చేరింది. గత 24 నాలుగు గంటల్లో అక్కడ కొత్తగా 2,089 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 62,589కి చేరిందని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.
పాకిస్థాన్: పాకిస్థాన్లో కరోనా మరణాల సంఖ్య 54కు చేరింది. ఇవాళ 500కు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4వేలు దాటింది. 429 మంది కోలుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
జపాన్‌లో అత్యవసర పరిస్థితి
జపాన్‌లో వైరస్ కేసుల సంఖ్య 4 వేలకు చేరువైన నేపథ్యంలో ప్రధాని షింజో అబే... టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో అత్యవసర స్థితిని విధించారు.
ఇటలీ: ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 16 వేల 523కు పెరగగా.... వైరస్ కేసుల సంఖ్య లక్షా 32 వేల 547కు చేరింది. కరోనా కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఇటలీ ప్రధాని గెసిపే కోంటే... 400 బిలియన్ యూరోల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు.