ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 22.5లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 1.54 లక్షల మంది మరణించారు. 5.71 లక్షల మంది కోలుకున్నారు.
కరోనా బీభత్సానికి అమెరికా అతలాకుతలం అవుతోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 7 లక్షలకుపైగా నమోదయ్యాయి. 35 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 14 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికావ్యాప్తంగా కరోనా ధాటికి 65 వేల మంది చనిపోయే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. దేశంలో ఇప్పటివరకు 37.8 లక్షల మందికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేసినట్లు తెలిపారు ట్రంప్.
రైతులకు ప్యాకేజీ..
కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగానికి 19 బిలియన్ డాలర్ల ఉపశమన ప్యాకేజీని ప్రకటించారు ట్రంప్. ఈ ప్యాకేజీతో రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో 3 బిలియన్ డాలర్లతో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని చెప్పారు.
దక్షిణ ఇటలీకి విముక్తి..
దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో కరోనాపై విజయం సాధించినట్లు ఇటలీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఉత్తర ప్రాంతం కన్నా తక్కువ చర్యలే చేపట్టినా కరోనాను తరిమికొట్టగలిగామని పేర్కొన్నారు అక్కడి అధికారులు.
అయినప్పటికీ షట్డౌన్ కొనసాగిస్తున్నట్లు ఇటలీ ప్రధాని గీసెప్పె కాంట్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో 6 లక్షల మందికి వైరస్ సోకగా.. 22 వేలకు పైగా మరణించారు.
ఆఫ్రికాలో పెరుగుదల..
మిగతా ప్రాంతాలతో పోలిస్తే కరోనా వ్యాప్తిలో చాలా మెరుగ్గా ఉన్న ఆఫ్రికా ఖండంలో క్రమంగా కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దేశాల్లో ఇప్పటివరకు 19,334 కేసులు నమోదుకాగా.. 1,000 మంది మరణించారు.
ఆఫ్రికాలో కరోనా ప్రభావం అల్జీరియాపై అధికంగా ఉంది. ఇక్కడ 364 మంది మరణించారు. ఈజిప్టులో 205, మొరాకోలో 135, దక్షిణాఫ్రికాలో 50 మంది మృత్యువాత పడ్డారు. ఈ దేశాల్లో నిర్ధరణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తిని సరిగా అంచనా వేయలేమని నిపుణులు ఉంటున్నారు.
వ్యాక్సిన్ తయారీకి..
బ్రిటన్లో కరోనా మరణాలు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ తయారీపై టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం వాణిజ్య, పరిశోధన సంస్థలకు అనుమతులు ఇచ్చేందుకు నిబంధనల సమీక్ష కూడా నిర్వహిస్తామని బ్రిటన్ వాణిజ్య మంత్రి ఆలోక్ శర్మ తెలిపారు.
ఇందుకోసం ఏర్పాటు చేసిన 21 పరిశోధన ప్రాజెక్టులకు 14 మిలియన్ పౌండ్ల సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
అన్ని దేశాలు చైనా దారిలోనే..
కరోనా మరణాల లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత చైనా తరహాలో మృతుల సంఖ్యను చాలా దేశాలు సవరిస్తాయని అభిప్రాయపడింది.
చైనాలో మరణాలపై ప్రపంచదేశాలు సందేహిస్తున్న వేళ.. గణాంకాలను 50 శాతం మేర పెంచింది. లెక్కల్లో తప్పులు చోటుచేసుకున్నాయని అంగీకరించింది. ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్న సమయంలో గణించే విధానంలో చేసిన మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది.
చైనా వెలువరించిన తాజా గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో మృతుల సంఖ్య 4,632కు చేరింది. మరోవైపు.. చైనాలో దిగుమతి కేసుల సంఖ్య 1,566కు పెరిగాయి. తాజాగా 27 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,719కు చేరుకుంది.
ఇదీ చూడండి: ట్రంపరితనానికి కళ్లెం వేసిన కరోనా!