టీకా పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నప్పటికీ.. త్వరలోనే రోజుకు 10లక్షల వ్యాక్సిన్లు అందించే స్థాయికి అమెరికా చేరుతుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీ అశాభావం వ్యక్తం చేశారు. అయితే రానున్న వారాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
"ఏదైనా పెద్ద ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటిని సరిచేశారని నేను అనుకుంటున్నా. గతనెల 14న వ్యాక్సినేషన్ ప్రక్రియన ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటికే రోజుకు 5లక్షల టీకాలు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు హాలీడే సీజన్ కూడా ముగిసింది. వ్యాక్సిన్నేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఫలితంగా టీకా పంపిణీ రోజుకు 10లక్షలకు చేరుతుంది."
--- డా. ఫౌచీ, అంటువ్యాధుల నిపుణుడు.
అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ "100 రోజుల్లో 100 మిలియన్ వ్యాక్సిన్ల" లక్ష్యాన్ని అమెరికా చేరుకోగలదని అభిప్రాయపడ్డారు ఫౌచీ. ఇది ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
అమెరికా రోగ నిరోధక నివారణ కేంద్రం ప్రకారం.. మంగళవారం ఉదయం నాటికి 4.8 మిలియన్ డోసులను 17మిలియన్ మందికిపైగా ప్రజలకు అందించారు. ఈ సంఖ్య చాలా తక్కువ అని, ప్రక్రియను వేగవంతం చేయాలని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
ఇదీ చూడండి:- 'కొత్త రకం కరోనాను తేలికగా తీసుకోలేము'