కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలను వీలైనన్ని ఎక్కువ చేసేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరీక్ష పద్ధతిని అభివృద్ధి చేశారు. దీని ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉనికి గుర్తించవచ్చు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మరింత వేగంగా, ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలు కలుగనుంది. దీనిపై అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆప్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (యూఎంఎస్ఓఎమ్) పరిశోధకులు అధ్యయనం చేయగా.. ఏసీఎస్ నానో జర్నల్‌లో పరిశోధన ప్రచురితమైంది.
అధ్యయనం ప్రకారం.. ఈ పరీక్షలో బంగారు నానోపార్టికల్స్‌ను ఉపయోగిస్తారు. అవి రంగు మార్పులను గుర్తించడం ద్వారా కరోనా వైరస్‌ను తక్కువ సమయంలో నిర్ధరణ చేయొచ్చు అని యూఎంఎస్ఓఎమ్ పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరీక్ష కిట్ తయారు చేయాడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అలాగే ఈ పరీక్ష నిర్వహించేందుకు అధునాతన ప్రయోగశాల పద్ధతులు అవసరం లేదని పరిశోధకులు తెలిపారు.
"మా ప్రాథమిక పరీక్ష ఫలితాల ఆధారంగా, ఈ నూతన పరీక్ష... రోగికి కరోనా సోకిన మొదటిరోజే దాని 'ఆర్ఎన్ఏ'ను గుర్తించగలదని నమ్ముతున్నాం. ఏదేమైనా దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది."
- దీపాంజన్ పాన్, యూఎంఎస్ఓఎమ్ పరిశోధకులు
పరీక్ష ఇలా!
రోగి లాలాజలం లేదా ముక్కు నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా కరోనా పరీక్ష చేస్తారు. ఈ సాధారణ ప్రక్రియ ద్వారా కేవలం 10 నిమిషాల్లో వైరస్ ఆర్ఎన్ఏను గుర్తించగలుగుతారు.
కరోనా వైరస్ ప్రత్యేకమైన జన్యు శ్రేణిలోని ఒక నిర్దిష్ట ప్రోటీన్‌ను గుర్తించడానికి బంగారు నానోపార్టికల్స్ ఉపయోగిస్తారు. ఈ బయోసెన్సార్ వైరస్ జన్యుశ్రేణికి అనుసంధానమైనప్పుడు.. బంగారు నానోపార్టికల్స్ ద్రవకారకాన్ని పర్పుల్ రంగు నుంచి నీలం రంగులోకి మారుస్తాయి.
చాలా నెమ్మదిగా..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక డయాగ్నొస్టిక్ పరీక్షలు... కరోనా సోకిన చాలా రోజులకు కూడా వైరస్‌ను గుర్తించలేకపోతున్నాయి. ఫలితంగా కరోనా సోకినప్పటికీ ఫలితాలు నెగిటివ్‌గా వస్తున్నాయి. కానీ తాజా ఆర్ఎన్ఏ ఆధారిత పరీక్షతో కరోనా సోకిన తొలి రోజే కచ్చితమైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: శునకంతో నర్సు స్నేహం.. 'కరోనా' ఒత్తిడి మాయం