మహిళా సాధికారతపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. నిర్ణయాత్మక వ్యవహారాల నుంచి మహిళలను వేరు చేస్తే ప్రజాస్వామ్యం లోపభూయిష్ఠంగా మారుతుందని అన్నారు. ఉపాధ్యక్ష హోదాలో తొలిసారి ఐరాస వేదికగా ప్రసంగించిన కమల.. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం క్షీణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రజాస్వామ్యం అతి తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా గత 15 ఏళ్లుగా స్వేచ్ఛ క్షీణిస్తూ వస్తోంది. గత కొన్నేళ్లలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ క్షీణత అత్యంత దారుణంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మహిళల స్థితిగతులే ప్రజాస్వామ్య స్థితిని నిర్దేశిస్తాయి. ఈ రెండింటినీ మెరుగుపర్చేందుకు అమెరికా పనిచేస్తూనే ఉంటుంది. మహిళలు నిర్ణయాత్మక ప్రక్రియలో భాగమైతే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది."
-కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు
ప్రపంచం ఆర్థిక, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలోనూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్ఘాటించారు కమల. లింగ వివక్ష లేకుండా ప్రతిఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి మహిళల ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. హెచ్ఐవీ, టీబీ, మలేరియా, పోషకాహార లోపం, శిశు మరణాలు వంటి సమస్యలను రూపుమాపేందుకు ఇన్నేళ్లు చేసిన కృషిని మహమ్మారి దెబ్బతీసిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మయన్మార్ నిరసనకారులకు ఇకపై మరణ శిక్షలు!