కరోనాతో ఆసుపత్రిలో చేరిన వారిలో సమస్య తీవ్రమైతే ఎక్కువ రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సి వస్తుందని, అలాంటి వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ఆసుపత్రి సీనియర్ వైద్యులు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు కుమార్ కలపటపు తెలిపారు. అధిక సంఖ్యలో కరోనా బాధితులున్న ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆయన అక్కడి ప్రస్తుత పరిస్థితిని ‘ఈనాడు’ ప్రతినిధికి వివరించారు. కొలంబియా ఆసుపత్రిలో మూడు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 నుంచి 1300కు పెరిగిందన్నారు. అమెరికాలో అత్యధిక కేసులు నమోదైన న్యూయార్కులోనే కొలంబియా విశ్వవిద్యాలయం ఉంది. అక్కడి పరిస్థితి ఆయన మాటల్లోనే..
కేసుల పెరుగుదల శాతం తగ్గుముఖం
- వారం రోజుల క్రితం వరకు రోజూ రెండింతల కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రెండింతలు కావడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. కేసులు పెరుగుతున్నా, పెరుగుదల శాతం తగ్గడం మంచి పరిణామంగా భావిస్తున్నాం. పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరిగే కొద్దీ కేసులు పెరుగుతాయి.
- మా ఆసుపత్రిలో 300 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. వెంటిలేటర్ మీదకు వచ్చిన వారు 14 నుంచి 21 రోజుల వరకు ఉండాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు వెంటిలేటర్‌పై ఉంటే మరణించే వారి శాతం ఎక్కువగా ఉంటుంది.
- యువకుల్లో ప్రత్యేకించి ఊబకాయం (ఒబెసిటీ) ఉన్నవారికి కరోనా సోకితే బయటపడటం కష్టంగా ఉంది. ఇక్కడ డయాబెటిస్, సీవోపీడీ ఉన్న 49 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకింది. ఏమి చేయడానికి అవకాశం లేకపోయింది. చనిపోయాడు.
- న్యూయార్కు రాష్ట్రంలో బుధవారం నాటికి కరోనా మరణాలు 2,373, పాజిటివ్ కేసులు 92,381. మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, ఒబెసిటీ ఉండి కరోనా బారిన పడిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఎక్కువగా వెంటిలేటర్‌పైకి వెళ్తున్నారు.
- భారతీయుల్లోనూ చాలా పాజిటివ్ కేసులున్నాయి. ఇది ఆందోళన చెందాల్సినంత సంఖ్య కాదు. ఎక్కువ మంది జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. ఊపిరి పీల్చుకోలేక, ఆక్సిజన్ అవసరమైన వాళ్లు ఆసుపత్రికి వస్తున్నారు. వైద్యుడైన నా మిత్రుడికి, ఆయన భార్యకు పాజిటివ్ వచ్చింది. ఆయన ఇంట్లోనే ఉన్నారు. భార్యను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆయన వచ్చి భార్యను చూడలేని స్థితి.
- ఇక్కడ చికిత్స పరికరాలు మొదట్లో తక్కువగా ఉన్నా ఇప్పుడు సమస్య లేదు. గవర్నర్, స్థానిక సంస్థలు అందరూ పూర్తిగా ఇదే పనిలో ఉన్నారు. మరో 15-20 రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నెల రోజుల్లో సాధారణ పరిస్థితికి రావచ్చని ఆశిస్తున్నాం.
- 82 ఏళ్ల ఒక ఫిజీషియన్ 15 రోజుల క్రితం వరకు రోగులను చూశారు. ఒక పేషెంట్ నుంచి ఆ వైద్యుడికీ వైరస్ సోకడంతో ఆయన 14 రోజులుగా వెంటిలేటర్ మీద ఉన్నారు.