అమెరికాలో కరోనా వైరస్ మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది. కరోనా మరణాల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. జాన్‌హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. అమెరికాలో కొవిడ్ మృతుల సంఖ్య 4లక్షల 98 వేల 879గా ఉంది. ఈ సంఖ్య అమెరికాలోని కన్సాస్ నగర జనాభాకు సమానమని జాన్‌హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ రాత్రికి మరణాల సంఖ్య 5లక్షలు దాటుతుందని అంచనా వేసింది.
వైరస్ కేసుల సంఖ్య 2 కోట్ల 81లక్షల 33వేలకుపైగా ఉంది. 1918 నాటి మహమ్మారి సహా గత 102 ఏళ్లలో అమెరికా ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ చెప్పారు.
కొవ్వొత్తుల నివాళి..
కరోనా మృతుల సంఖ్య 5లక్షలకు చేరువైన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైెడెన్.. ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు శ్వేతసౌధంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించి, మౌనం పాటించనున్నారు. కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ బైడెన్ మాట్లాడనున్నారు.
ఇదీ చదవండి:'2022లోనూ అమెరికన్లకు మాస్కులు తప్పవు'