కరోనా మూలలపై పరిశోధనలు మరోసారి చైనా వైపు వేలు చూపిస్తోన్న వేళ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). కొవిడ్‌తో జరిగిన నష్టానికి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాలు పరిహారం, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. నార్త్ కరోలినా రిపబ్లిక్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ.. చైనా కచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు.
"కనీసం 10 ట్రిలియన్ డాలర్లను చైనా పరిహారం కింద చెల్లించాలి. ఆ దేశం చేసిన నష్టం కంటే ఈ మొత్తం చాలా తక్కువ. ప్రపంచ దేశాలు చైనాకు ఇక ఏమాత్రం బాకీ లేవు. చైనానే ప్రపంచానికి బాకీ ఉంది. ఎన్నో దేశాలను అది నాశనం చేసింది. దానికి బాకీ ఉన్న దేశాలు తమ అప్పును.. పరిహారం సొమ్ములో డౌన్పేమేంట్గా భావించి రద్దు చేసుకోవాలి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
అన్ని చైనా వస్తువులపై అమెరికా 100శాతం పన్నులు విధించాలని ట్రంప్ చెప్పారు. దీంతో చైనా సైనిక సామర్థ్య పెంపునకు అడ్డుకట్ట వేయడమే కాక ఎన్నో కంపెనీలు తిరిగి అమెరికా వస్తాయని అన్నారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా లెక్కచేయదని తెలిపారు.
బైడెన్‌ను కొనేశారు..
"చైనా వైరస్ వచ్చేంతవరకు జిన్‌పింగ్‌తో నాకు సత్సంబంధాలున్నాయి. బైడెన్‌ను చైనా అసలు లెక్క చేయదు. అయనదో అవినీతి, పిరికి ప్రభుత్వం. చైనా ఆయన్ను కొనేసింది. సీసీపీ నుంచి మిలయన్ల డాలర్లను బైడెన్ కుటుంబానికి అందాయి. మీడియా దాని గురించి మాట్లాడదు. ఇక కరోనా మూలల దర్యాప్తు ప్రక్రియను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసింది," అని ట్రంప్ ఆరోపించారు.
ఇదీ చూడండి: 'వైరస్ గురించి నేను ముందే చెప్పా కదా'