కొవిడ్ -19 చికిత్సకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొందిన ప్రయోగాత్మక యాంటీబాడీ మిశ్రమం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాను ఇది సమర్థంగా నయం చేస్తుందని చెప్పారు. జంతువుల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు.
అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ రిజెనరాన్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇందులో రెండు రకాల యాంటీబాడీలతో కూడిన మిశ్రమం ఉంటుంది. అయితే దీని సమర్ధతను మరింత విస్తృతంగా పరీక్షించడానికి పలు రకాల జంతువుల్లో దాన్ని పరీక్షించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రిజెన్-కోవ్-2 అనే ఈ యాంటీబాడీ మిశ్రమాన్ని కోతులు, మూషికాల్లో పరీక్షించారు. కోతులను కరోనా వైరస్‌కు గురి చేసినప్పుడు వాటిలో స్వల్పస్థాయిలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఎలుకల్లో మాత్రం తీవ్ర రుగ్మతలు తలెత్తాయి. వాటి బరువు వేగంగా పోయింది. కోతులను వైరస్‌కు గురిచేయడానికి మూడు రోజుల ముందు యాంటీబాడీ మిశ్రమాన్ని ఇచ్చిన సందర్భంలో.. ఇన్ఫెక్షన్ తలెత్తకుండా పూర్తిగా అడ్డుకట్ట పడినట్లు తేలింది.
నివారణ సామర్థ్యం కూడా
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్ సోకిన ఒక రోజు తర్వాత దీన్ని ఇచ్చినప్పుడు.. శరవేగంగా వైరస్ నిర్మూలన జరిగింది. ఇన్ఫెక్షన్ సోకడానికి రెండు రోజుల ముందు మూషికాలకు ఈ మిశ్రమాన్ని ఇచ్చినప్పుడు.. బరువు తగ్గిపోవడం నాటకీయ స్థాయిలో ఆగిపోయిందని వెల్లడైంది. వాటి ఊపిరితిత్తుల్లో వైరల్ లోడు కూడా తగ్గిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన ఒక రోజు తర్వాత ఈ చికిత్స సాధనాన్ని ఇచ్చినా మంచి ప్రయోజనమే కలిగిందని చెప్పారు. దీన్నిబట్టి ఈ యాంటీబాడీ మిశ్రమానికి చికిత్సతో పాటు నివారణ సామర్థ్యం కూడా ఉందని స్పష్టమవుతోందన్నారు.