ప్రపంచంపై కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 5,396 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 71, 736 మందికి వైరస్ సోకింది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజులో 1,524 మంది మరణించారు. కొత్తగా 25,568 మందికి వైరస్ సోకింది. అమెరికాలో 5,58,447 మందికి వైరస్ సోకగా.. 21,990 మందికి పైగా మహమ్మారికి బలయ్యారు. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం త్వరలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుందని అమెరికా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న న్యూయార్క్ నగరంలో 24 గంటల్లో 758 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో మొత్తంగా 9,385 మంది చనిపోయారు.
బ్రిటన్‌లో..
బ్రిటన్‌లో ఒక్కరోజు వ్యవధిలో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 10,600 దాటగా, కొత్తగా 5వేల 2వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో మొత్తం కేసుల సంఖ్య 85,000లకు చేరువైంది. గణనీయంగా పెరుగుతున్న మృతుల సంఖ్య నేపథ్యంలో.. ఐరోపాలో ఖండంలోనే బ్రిటన్‌లో అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యే దేశంగా నిలివచ్చని ఆ దేశ శాస్త్రీయ సలహాదారు సర్ జెర్మీ ఫర్రర్ హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లో..
ఫ్రాన్స్‌లో ఒకే రోజు అత్యధికంగా 561 మంది మృతి చెందారు. కొత్తగా సుమారు 3,000 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 1,32,000 దాటింది. మృతుల సంఖ్య 14,400కు చేరింది.
ఇటలీలో..
కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానంలో ఉన్న ఇటలీలో మూడు వారాల తర్వాత తక్కువ మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో ఆదివారం 431 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా వైరస్‌కు బలయిన వారి సంఖ్య 19,900కి చేరింది. బాధితుల సంఖ్య 1,50,000 దాటింది.
స్పెయిన్‌లో..
కరోనా ధాటికి స్పెయిన్‌లో ఆదివారం ఒక్కరోజే 603 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 17,200కు చేరింది. స్పెయిన్‌లో కొత్తగా 3,800 పైగా కేసులు బయటపడగా, మొత్తం కేసుల సంఖ్య 1,66,800 పైగా ఉన్నాయి.
బెల్జియం..
బెల్జియంలో ఆదివారం ఒక్కరోజే 254 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 3,600కు చేరింది. కొత్తగా 1600 కేసులను గుర్తించగా, మొత్తం కేసుల సంఖ్య 30,000కు చేరువైంది.
నెదర్లాండ్స్‌లో ఒకే రోజులో 94 మంది వైరస్‌కు బలయ్యారు. మృతుల సంఖ్య 2,700 దాటింది. స్విట్జర్లాండ్‌లో కొత్తగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1000కి పైగా ఉన్నాయి. కరోనా వల్ల ఆదివారం పోర్చుగల్‌లో 34 మంది, రష్యాలో 24 మంది, కెనడాలో 21 మంది అసువులు బాశారు.
ఇరాన్‌లో..
కరోనా ప్రభావంతో ఆదివారం ఇరాన్‌లో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మృతుల సంఖ్య 4,400 దాటింది. టర్కీలో ఆదివారం ఒక్క రోజులోనే 4,700 కరోనా కేసులు బయట పడ్డాయి. 97 మంది చనిపోయారు. టర్కీలో మొత్తం మృతుల సంఖ్య 1200 చేరువైంది.
కరోనా వైరస్ కేంద్రమైన చైనాలో ఈ మహమ్మారి కారణంగా ఆదివారం ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు.
ఇదీ చూడండి: స్వీయ నిర్బంధంతో మానసిక రుగ్మతలు!