అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో మంగళవారం ఉదయం ఎస్‌యూవీ, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. అయితే ఈ కేసులో మరో కోణం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో ప్రమాదం జరగడం వల్ల మానవ అక్రమ రవాణా జరుగుతుందా అన్న అనుమానం తతెత్తుతుంది.
మృతుల్లో ఎక్కుమంది మెక్సికన్లే..
ప్రమాదానికి గురైన ఎస్‌యూవీలో 25 మంది ప్రయాణికులు ఉండటం పలు అనుమానాలుకు దారితీసింది. మృతుల్లో ఎక్కువ మంది మెక్సికన్లు కావడం గమనార్హం. వారంతా 15 నుంచి 53 ఏళ్లు లోపువారేనని అధికారులు ధ్రువీకరించారు. మెక్సికన్ విదేశీ విభాగానికి చెందిన రాబర్టో వెలస్కో కూడా 10 మెక్సికన్లు చనిపోయినట్లు ట్వీట్ చేశారు.
అంత మందిని ఎలా ఎక్కించారు?
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. ఉదయం 6.15(అమెరికా కాలమానం ప్రకారం) నిమిషాలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎస్యూవీకి ఎడమవైపు ట్రక్కు ఢీ కొట్టింది. వెనుకవైపు రెండు ఖాళీ ట్రాలీలు ఉన్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ చీఫ్ ఒమర్ వాట్సన్ తెలిపారు. ఎనిమిది మంది పట్టే వాహనంలో అంతమందిని ఎందుకు ఎక్కించారో తెలియరాలేదు. ఎస్‌యూవీలో ముందు సీట్లు మాత్రమే ఉన్నాయని.. మధ్య, వెనుక సీట్లను తొలగించి, వారిని ఎక్కించినట్లు చెప్పారు.
వారిని ఎక్కడికి తరలిస్తున్నారు?
సరిహద్దులు దాటిన వలసదారులను ఎస్‌యూవీలో రహణా చేస్తున్నారా? వ్యవసాయ కార్మికులను పొలాలకు తీసుకెళ్తున్నారా లేదా మరేదైనా ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారా? అనే విషయాలపై స్పష్టత రాలేదని అధికారులు పేర్కొన్నారు.
ఎస్‌యూవీ నేరుగా కూడలిలోకి ప్రవేశించిందని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కారు అక్కడ ఆగిపోయిందా? లేదా హైవేలోకి ప్రవేశించే ముందు ఆగిపోయిందా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ట్రక్కు ఎంత వేగంగా వచ్చింది అనే విషయంపైన స్పష్టత లేదు.
అయితే మానవ అక్రమ రవాణా కోణంలో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: అమెరికాలో ఘోర ప్రమాదం-15 మంది మృతి