బోయింగ్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన మానవరహిత రోదసి యాత్ర అర్థంతరంగా ముగిసింది. స్టార్లైనర్ వ్యోమనౌక గడియారంలో తలెత్తిన సమస్య కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వద్దకు చేరకుండానే భూమిని తాకింది. అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో వ్యోమనౌక దిగినట్లు నాసా వర్గాలు వెల్లడించాయి.
భూ వాతావరణంలోకి ప్రవేశించాక మూడు పారాచూట్ల సాయంతో కిందకు దిగిన వ్యోమనౌక సురక్షితంగా భూమిని తాకినట్లు నాసా విడుదల చేసిన చిత్రాలు నిర్ధరిస్తున్నాయి. ఈ స్టార్ లైనర్ వ్యోమనౌకను శుక్రవారమే అట్లస్-వి రాకెట్ ద్వారా రోదసిలోకి పంపించింది అమెరికా. అయితే రాకెట్ నుంచి విడిపోయిన కొద్ది సేపటికే వ్యోమనౌకలోని థ్రస్టర్స్ అనుకున్న సమయానికి పనిచేయలేదు. ఈ కారణంగా సముద్ర మట్టానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ను చేరుకోవడంలో విఫలమైంది స్టార్ లైనర్.
ఈ నేపథ్యంలో వ్యోమనౌకకు, స్పేస్ స్టేషన్కు మధ్య దూరం, అప్పటికే దాని విభాగాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా బోయింగ్ సంస్థ, నాసాలు వెనక్కి రప్పించాయి. వ్యోమనౌకను వెనక్కి రప్పించడానికి గల కారణాలను వివరించారు బోయింగ్ సంస్థ ప్రతినిధి.
"మేం తప్పుడు సమయానికి గడియారాన్ని ప్రారంభించాం."
-జిమ్ చోల్టన్, బోయింగ్ రోదసి కార్యక్రమ ప్రతినిధి
ఇదీ చూడండి: ఆపరేషన్ ఎన్ఆర్సీ: ఏకాకిలా భాజపా- ఎలా ముందుకు?