అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ బృందంలో మరో ఇద్దరు ఇండో అమెరికన్లకు చోటు లభించింది. భారత సంతతికి చెందిన రీమా షా, నేహా గుప్తాను శ్వేతసౌధ న్యాయ నిపుణుల బృందానికి ఎంపిక చేస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. రీమాను వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా నియమించారు. నేహా గుప్తాను అసోసియేట్ కౌన్సెల్‌గా ఎంపిక చేశారు.
న్యాయ శాఖలోని సొలిసిటర్ జనరల్ కార్యాలయంలో అసోసియేట్‌గా పనిచేశారు రీమా షా. అమెరికా సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఎలీనా కగన్తో పాటు, డీసీ సర్క్యూట్‌కు చెందిన అప్పీల్ కోర్టులో జడ్జి శ్రీ శ్రీనివాసన్‌కు క్లర్క్‌గా సేవలందించారు. న్యూజెర్సీకి చెందిన రీమా షా.. హార్వర్డ్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్లో విద్యనభ్యసించారు. బైడెన్-హారిస్ ప్రచార కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. బైడెన్ డిబేట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమెరికాకు వలస వెళ్లిన భారతీయులకు నేహా గుప్తా జన్మించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. హార్వర్డ్ కాలేజీ, స్టాన్ఫోర్డ్ లా స్కూల్ నుంచి పట్టా అందుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ కార్యాలయంలో డిప్యూటీ సిటీ అటార్నీగా పనిచేశారు. తొమ్మిదో సర్క్యూట్ యూఎస్ అప్పీల్స్ కోర్టులో న్యాయమూర్తి మైఖెల్ డేలీ హావ్కిన్స్తో పాటు కాలిఫోర్నియాలోని జిల్లా కోర్టు జడ్జి రిచర్డ్ సీబర్గ్కు క్లర్క్‌గా వ్యవహరించారు.
ఇవీ చదవండి:
బైడెన్ బృందంలో మాల- ఉడుపి వాసుల హర్షం