కొవిడ్ మహమ్మారితో ధైర్యంగా పోరాడుతున్న భారత్‌కు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హామీ ఇచ్చారు. కొవిషీల్డ్ టీకా ముడిపదార్థాలను తక్షణమే భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
"గతంలో కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికాకు భారత్ ఆపన్నహస్తం అందించింది. అలాగే మేము కూడా ఇప్పడు భారత్‌కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్‌కు మిగులు టీకాలను సరఫరా చేయకపోవడంపై.. బైడెన్ ప్రభుత్వంపై ఆయన సొంత పార్టీ డెమొక్రటిక్ నుంచే విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలో బైడెన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
" కొవిడ్-19 ను కట్టడి చేసేందుకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలను పంపించేందుకు భారత ప్రభుత్వంతో అమెరికా చర్చలు జరుపుతోంది. భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నా."
-- కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు
అంతకుముందు.. కొవిషీల్డ్ టీకా ముడిపదార్థాలను తక్షణమే భారత్‌కు పంపించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్తో అమెరికా భద్రతా సలహాదారు జాక్ సలివన్ ఫోన్లో సంభాషించారు.
"అమెరికా, భారత్ మధ్య ఏడు దశాబ్దాలుగా వైద్య సంబంధాలు ఉన్నాయి. పోలియో, ఎయిడ్స్ లాంటి వ్యాధులపై కలసి పోరాడాం. ఇప్పడు కరోనా మహమ్మారిని సైతం.. కలిసికట్టుగా ఎదుర్కొందాం."
-- జాక్ సలివన్, అమెరికా భద్రతా సలహాదారు
అంతేకాక అత్యవసరమైన ర్యాపిడ్ టెస్టు కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈలు, ఆక్సిజన్ ఉత్పత్తి, సంబంధిత సామగ్రిని భారత్‌కు పంపేందుకు అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఇందుకోసం యూఎస్ ఎంబసీ, కేంద్ర ఆరోగ్య శాఖ సహకారంతో ప్రజారోగ్య సలహాదారుల నిపుణుల బృందాన్ని అమెరికా నియమించిందని తెలిపింది.
బిలియన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి
భారత్‌లో వ్యాక్సిన్ తయారీదారు అయిన బయో- ఈ కోసం ఉత్పాదక సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరించడానికి యూఎస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు సమకూరుస్తోందని తెలిపింది. 2022 చివరి నాటికి బయో-ఈ కనీసం ఒక బిలియన్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుందని వివరించింది.
400 ఆక్సిజన్ మిషన్లు సరఫరా
కరోనాపై పోరులో భారత్‌కు సహకరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తోంది అమెరికాలోని స్వచ్ఛందసంస్థ సేవా ఇంటర్నేషనల్. ఇందులో భాగంగా భారత్‌కు 400 ఆక్సిజన్ మిషన్లను సరఫరా చేయనుంది. ఐదు మిలియన్ డాలర్లను విరాళాల ద్వారా సేకరిస్తుంది.
ఇదీ చదవండి : కొవిడ్ ఆస్పత్రిలో ప్రమాదం- 82 మంది మృతి