'అమెరికా ఈజ్ బ్యాక్' అంటూ ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించారు అగ్రరాజ్య అధినేత జో బైడెన్. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. అమెరికా చేపట్టాలనుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని పరిష్కరించడం, చైనా, రష్యా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడం, కరోనా నష్టాలను నివారించడం తమ ప్రాధాన్యాలుగా వివరించారు. ఇందుకోసం పశ్చిమ దేశాల సహకారం కావాలని కోరారు.
"గత కొద్ది సంవత్సరాల్లో అమెరికా-ట్రాన్స్అట్లాంటిక్ దేశాల సంబంధాలు పరీక్షలు ఎదుర్కొన్నాయి. ఐరోపా దేశాలతో సంప్రదింపులు మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లేందుకు, నమ్మకమైన భాగస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా కట్టుబడి ఉంది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నామని బైడెన్ తెలిపారు. ఇరాన్ అణు ఒప్పందంపై ముందుకెళ్లేందుకు చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. చైనా నుంచి దీర్ఘకాలిక వ్యూహాత్మక పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి సవాల్‌ను ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య దేశాలన్ని కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
"చైనాతో వ్యూహాత్మక దీర్ఘకాలిక పోటీని ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. చైనా నుంచి గట్టి పోటీ ఉంటుంది. దీన్ని నేను ఆహ్వానిస్తున్నా. అంతర్జాతీయ వ్యవస్థలపై నాకు నమ్మకం ఉంది. అమెరికాతో పాటు మా కూటమి దేశాలు, ఇండో-పసిఫిక్‌లోని భాగస్వామ్య దేశాలు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 70 ఏళ్లు కృషి చేశాయి. శాంతి పరిరక్షణ కోసం ఆసియా, ఐరోపా, అమెరికా ఏ విధంగా పనిచేస్తాయనే విషయంపై తమ ప్రభుత్వం దృష్టిసారిస్తుంది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే చైనా ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని బైడెన్ పిలుపునిచ్చారు. అన్ని దేశాలు ఒకే నియమాలను పాటించాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఇలా చేస్తేనే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నవారిని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని అన్నారు.
ఇదీ చదవండి: 'సమాఖ్య విధానమే దేశాభివృద్ధికి మూలం'