అగ్రరాజ్యం ఆరోగ్యశాఖలో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న ఆంటోనీ ఫౌచి- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలు ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. తాజాగా ఈ వార్తలకు ట్రంప్ చెక్ పెట్టారు. ఆరోగ్య రంగ సలహాదారు ఫౌచిని విధుల నుంచి తొలగించడం లేదని స్పష్టం చేశారు. తన దృష్టిలో ఫౌచి ఓ మంచి వ్యక్తి అని చెప్పారు ట్రంప్.
అయితే కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలను ట్రంప్ తిప్పికొట్టారు. మీడియా, డెమొక్రాట్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా మొదలు..
భౌతిక దూరం, లాక్డౌన్ వంటి నిబంధనలను మొదట్లోనే అమలు చేసి ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదా..? అన్న ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫౌచి సమాధానమిచ్చారు.
"మొదట్లోనే చర్యలు చేపట్టి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలిచేవని చెప్పొచ్చు" అని వ్యాఖ్యానించారు.
ఫౌచి వ్యాఖ్యలను.. రిపబ్లికన్ పార్టీ నేత ఒకరు ఖండించారు. అంతేకాకుండా ఆయనకు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. దాన్ని ట్రంప్ రీట్వీట్ చేయడం ఊహాగానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ఫౌచి తన పదవి కోల్పోవడం ఖాయమని విశ్లేషణలు జోరందుకున్నాయి.
ఫౌచి ఇలా...
మరోవైపు అధ్యక్షుడికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు ఫౌచి. దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులపై నిర్వహించిన మీడియా సమావేశంలో తొలుత ఫౌచి మాట్లాడారు. ఫౌచి ఇలా చేయడం చాలా అరుదు.
మొదట్లోనే చర్యలు చేపట్టి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలిచేవన్న తన వ్యాఖ్యలు ఓ 'ఊహాజనితమైన' ప్రశ్నకు సమాధానమని గుర్తుచేశారు ఫౌచి. ఆర్థిక వ్యవస్థపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ఎంచుకున్న పదాలు సరైనవి కాదని తెలిపారు.