అమెరికాలోని ప్రతి పదిమంది పెద్దల్లో నలుగురు ఊబకాయంతో బాధపడుతున్నారని ఆ సర్వే తేల్చింది. అందులోని ఒకరిలో ఉబకాయం తీవ్రత అధికంగా ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఉబకాయంపై అమెరికా ప్రభుత్వం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ పరిశోధకులతో చేయించిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అమెరికాలోని 40 శాతం మంది పెద్దలు ఊబకాయం వలలో చిక్కుకున్నట్లు సర్వే చెబుతోంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ పరిశోధకులు ఐదువేల మందిని ఎంచుకొని ఎత్తు, బరువు కొలిచి ఓ సర్వే నిర్వహించారు. ఇదివరకు 8 శాతం ఉన్న ఈ ఊబకాయం రేటు ఇప్పుడు తొమ్మిదికి చేరుకుందని వెల్లడించింది సర్వే. అర్ధ శతాబ్ధం క్రితం ప్రతి 100 మందిలో కేవలం ఒకరు మాత్రమే ఉబకాయంతో బాధపడేవారని.. ప్రస్తుతం ఈ సంఖ్య పది రెట్లు పెరిగిందని స్పష్టం చేసింది.
ఉబకాయం వల్లే అమెరికా వాసులు అధికంగా గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి వాటి బారిన పడుతున్నారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుడు డాక్టర్ విలియం డైట్జ్ తెలిపారు. చికిత్స తీసుకునేవారు ఒక్కో ఉబకాయ నిపుణుడి వద్ద 100 మంది ఉన్నారని వారికి వైద్యం అందివ్వడం కష్టమవుతుందని ఆయన తెలిపారు. 2015-16 నాటికి 18.5 శాతం మంది చిన్నారులు, యువకులు ఊబకాయం బారిన పడ్డారని పేర్కొన్నారు.
వ్యాయామం లేకనే..
సరైన వ్యాయామం చేయకపోవడం, మంచి ఆహారం తీసుకోవడంపై శ్రద్ధ లేకపోవడమే ఉబకాయానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం సాధారణ కాలినడకను కూడా తగ్గించడం ఇది పెరగడానికి కారణం అన్నారు.
ఉండాల్సిందిలా..
బీఎమ్ఐ రేటు 25 కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువుగా నిర్ధారిస్తారు. అది 30 దాటితే ఊబకాయంగా లెక్కగడుతారు. 40 దాటితే తీవ్రత పెరిగినట్లు భావిస్తారు. సాధారణంగా ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉన్న అమెరికా మహిళలు బరువు 174 పౌండ్లు ఉంటే ఊబకాయంగా, 232 పౌండ్లు దాటితే ఉబకాయం తీవ్రత పెరిగినట్లు పరిశోధకులు పరిగణిస్తారు. పురుషుల్లో ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు ఉన్నవారిలో 203 పౌండ్లు ఉంటే ఊబకాయం ఉన్నట్లు, 270 దాటితే తీవ్రత పెరిగినట్లు లెక్కిస్తారు. పరిశోధకులు కూడా ఈ ప్రాతిపదికనే సర్వే చేశారు.
ఇదీ చదవండి: టెక్ గురూ: ఇక హైటెక్‌గా పళ్లు తోముకోండి