అమెరికాలో కొవిడ్ ధాటికి మరణించిన వారిలో 99.2శాతం మంది.. కరోనా టీకా తీసుకోనివారేనని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ తెలిపారు. ఈ మరణాలను నివారించే అవకాశం ఉన్నా.. ఆపలేకపోకపోవటం బాధాకరం అని పేర్కొన్నారు. అందరూ టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
"కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్న వారిలో 99 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారు. ఇవన్నీ నిర్మూలించగలిగేవే. మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత సమర్థమైన సాధనం మన చేతుల్లో ఉన్నప్పటికీ.. దానిని అందరూ తీసుకోకపోవడం విచారకరం. సిద్ధాంతపరమైన విభేదాలతో లేదా.. విజ్ఞాన శాస్త్రం మీద నమ్మకం లేకపోవటం వల్లనో కొంతమంది అమెరికన్లు టీకా తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆయుధాలు మన దేశంలో ఉన్నాయి. విభేదాలను పక్కన పెట్టి అందరూ తమ ఉమ్మడి శత్రువు వైరసేనని గ్రహించాలి."
-ఆంటోని ఫౌచీ, అమెరికా అంటువ్యాధులు నిపుణుడు
ప్రపంచ దేశాల్లో అనేక మంది టీకాలు దొరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ప్రతి అమెరికా పౌరుడికి అందించేందుకు సరిపడా వ్యాక్సిన్లు తమ దేశంలో ఉన్నాయని ఫౌచీ తెలిపారు. అందుకు అమెరికా చాలా అదృష్టమైన దేశం అని పేర్కొన్నారు.
1.5 కోట్ల మంది...
అమెరికాలో దాదాపు 1.5 కోట్ల మంది తమ కరోనా టీకా రెండో డోసును తీసుకోలేదని తేలింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో.. ప్రజలు రెండో డోసును తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉండటం వల్ల అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 వరకు అమెరికాలో 11 శాతం మంది మాత్రమే రెండో డోసు టీకాను తీసుకున్నారని 'వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనంలో తెలిపింది. మొదటి డోసు తీసుకుని 42 రోజులు గడిస్తే.. రెండో డోసును తీసుకోనట్లుగానే పరిగణిస్తారని పేర్కొంది.
అమెరికాలో వినియోగిస్తున్న టీకాల్లో ఫైజర్ టీకా తీసుకున్న వారు మూడు వారాల తర్వాత, మోడెర్నా టీకా తీసుకున్నవారు నాలుగు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని నిర్దేశించారు. రెండో డోసు తీసుకోవడంలో అత్యధిక మంది వెనుకడుగు వేస్తే.. దేశంలో వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని న్యూయార్క్‌కు చెందిన వ్యాధి నిపుణుడు క్రిస్టెన్ మార్క్స్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో 33 మంది మృతి
ఇదీ చూడండి: టీకాతో తలెత్తే రక్తపు గడ్డలకు చికిత్స