కొవిడ్-19 సంక్షోభ సమయంలో భారత్‌లోని 5 కోట్లమందికి పైగా బాలలు మానసిక అనారోగ్యంతో బాధపడ్డారని యూనిసెఫ్ వెల్లడించింది. కరోనా ప్రభావంతో పిల్లలు అధిక ఒత్తిడికి లోనయ్యారని యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి డాక్టర్. యాస్మిన్ అలీ హక్ తెలిపారు.
"ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకులు.. పిల్లలకు మానసికంగా, సామాజికంగా సహకారం అందించాలి. బాలలు ఒత్తిడి, భయం, ఆవేదనను తట్టుకునేలా చేపట్టే చర్యలను బలోపేతం చేయాలి. గతేడాది నుంచి పిల్లలపై హింస పెరగటం మనం చూశాం."
-- డాక్టర్. యాస్మిన్ అలీ హక్, యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి
పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు ఎలా స్పందించాలన్న దానిపై.. చైల్డ్‌లైన్, సివిల్ సొసైటీ అధికారులు, జిల్లాలో బాలల సంరక్షణ యూనిట్లు, పిల్లల రక్షణ సంస్థల్లోని 8వేలకు పైగా సిబ్బందికి కరోనా సమయంలో శిక్షణ ఇచ్చినట్లు యూనిసెఫ్ పేర్కొంది.
ప్రతి ఏడుగురిలో ఒక్కరు..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు పిల్లల్లో ఒకరు కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా మానసిక అనారోగ్యం బారినపడినట్లు యూనిసెఫ్ తేల్చింది. మొత్తం 13 కోట్ల మందికిపైగా బాలలు లాక్డౌన్లో ఇంటికే పరిమితమయ్యారని పేర్కొంది.
డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు ప్రకారం కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచంలోని 93 శాతం దేశాల్లో మానసిక వైద్య సేవలు నిలిచిపోయినట్లు తేలింది.
చైనాలోని 194 నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం.. 16 శాతం మంది కరోనా సమయంలో తాము కుంగుబాటుకు లోనవ్వడమే కాక ఒత్తిడినీ ఎదుర్కొన్నామన్నారు. 28 శాతం మంది.. తాము అధిక ఆవేదనతో బాధపడ్డట్లు తెలిపారు.
ఇదీ చదవండి : కొత్తరకం కరోనాపై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా?