ఆఫ్రికా దేశం సుడాన్ నిరసనలతో అట్టుడుకుతోంది(sudan military coup). సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపుతో వేలాంది మంది ప్రజలు సుడాన్ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు తొలుత బాష్పవాయువును ప్రయోగించగా ఫలితం దక్కలేదు. దీంతో ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు మరణించారు. మరో 80మంది గాయపడ్డారు(sudan protests 2021).
ఖార్టూమ్, అమ్డుర్మన్ నగరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. వేలాది మంది రోడ్ల మీద టైర్లకు నిప్పంటించి నిరసనలు తెలిపారు. ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేశారు. "ప్రజలే శక్తివంతులు, ప్రజలే శక్తివంతులు", "మేము వెనుదిరగము," అంటూ నినాదాలు చేశారు. అయితే నిరసనకారులను వెంటాడి మరీ భద్రతా దళాలు తరిమికొట్టినట్టు ప్రజాస్వామ్య కార్యకర్తలు ఆరోపించారు.
సహాయం కట్..
సుడాన్లో తాజా పరిణామాలపై అమెరికా(us sudan coup), ఐరోపా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో సైనిక తిరుగుబాటుతో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయన్నారు. మరోవైపు సుడాన్లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు ఐరోపా విదేశాంగ చీఫ్ జోసెఫ్ బోరెల్ ట్వీట్ చేశారు. దేశంలో పరిస్థితులు చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు సుడాన్‌కు అమెరికా ప్రత్యేక రాయబారి జెఫ్రి ఫెల్ట్‌మన్.
సుడాన్‌కు అందించే 700మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటన విడుదల చేసింది(us sudan coup). దేశంలో తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం నిధులపై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
ఇదీ జరిగింది..
సైనిక తిరుగుబాటుతో సోమవారం సుడాన్వ్యాప్తంగా కలకలం రేగింది. ఆపద్ధర్మ ప్రధాని అబ్దుల్లా హండోక్తో పాటు సీనియర్లను సైనికాధికారులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కాగా ప్రధాని ఎక్కడికి తీసుకెళ్లారనే సమాచారం తమకు అందలేదని ఆ దేశ సమాచారశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వాన్ని రద్దు చేసిన కొద్ది సేపటికి.. లక ప్రకటన చేశారు ఆర్మీ అధినేత జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 'దేశ అధికార మండలితో పాటు ప్రధాని అబ్దుల్లా హమ్డోక్ నేతృత్వంలోని ప్రభుత్వాని రద్దు చేస్తున్నాం. రాజకీయ వర్గాల మధ్య తగాదాలు సైన్యాన్ని జోక్యం చేసుకోవడానికి ప్రేరేపించాయి. అయినప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్యం దిశగా సాగే ప్రక్రియను పూర్తి చేస్తాం. కొత్త టెక్నోక్రాట్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది.' అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకోవడం వల్లే తిరుగుబాటు చేసినట్టు వెల్లడించారు. 2023 జూన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని, అయితే అధికారం మాత్రం మిలిటరీ చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
రెండేళ్ల క్రితమే ఒమర్ అల్ బషీర్ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యంవైపు అడుగులు వేస్తోంది సుడాన్. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది. సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్‌లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది(sudan military coup).
ఇదీ చూడండి:- సుడాన్లో సైనిక తిరుగుబాటు- ప్రధాని అరెస్ట్!