Omicron worldwide: ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండటం వల్ల ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్ దాదాపు 30 దేశాలకు పాకేసింది. డెల్టా రకం కంటే ఆరు రెట్లు వేగంతో వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఆందోళనకర వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఒమిక్రాన్ వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, తీవ్రమైన లక్షణాలేవీ లేవని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. భయపెడుతున్న ఈ ఒమిక్రాన్ ఏయే దేశాలకు ఎప్పుడు పాకిందో ఓసారి చూస్తే..!
- నవంబర్ 24న తొలిసారి రెండు దేశాల్లో B.1.1.529 (ఒమిక్రాన్) వేరియంట్‌ని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. దక్షిణాఫ్రికాలోని గుటాంగ్ ప్రావెన్స్‌తో పాటు బోట్స్‌వానా దేశంలో ఒకే రోజు ఈ కేసులు వెలుగుచూశాయి.
- నవంబర్ 26న దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఆ రోజు నాలుగు దేశాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. నెదర్లాండ్, ఇజ్రాయెల్, హాంగ్‌కాంగ్, బెల్జియంలలో ఒమిక్రాన్ కేసులు గుర్తించారు.
- నవంబర్ 27న మరో ఐదు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు చెక్ రిపబ్లిక్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్.
- నవంబర్ 28న డెన్మార్క్, ఆస్ట్రియాలో వెలుగుచూడగా.. నవంబర్ 29న మరో నాలుగు దేశాలకు (కెనడా, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్) ఒమిక్రాన్ వ్యాపించింది. ఆ తర్వాత 30న ఫ్రాన్స్, జపాన్, పోర్చుగల్‌లలో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
- డిసెంబర్ 1న అత్యధికంగా తొమ్మిది దేశాలకు విస్తరించింది. బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, నార్వే, ఐర్లాండ్, అమెరికా, ఘనా, యూఏఈ, నైజీరియాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
Omicron india: తాజాగా డిసెంబర్ 2న భారత్‌లో రెండు కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇవీ చూడండి: