African rat: 'చలనం జీవితం.. నిష్క్రియ మరణం' అనే నానుడిని అల్పజీవి అయిన ఓ మూషికం ఘనంగా చాటింది. మూషికమంటే అది మామూలు ఎలుక కాదు. కాంబోడియాలో మందుపాతరల అన్వేషణలో దిట్టగా పేరొంది, ఎందరో మనుషుల జీవితాలను కాపాడింది. తన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక బంగారు పతకం అందుకొన్న మూషిక రాజమిది. ఆఫ్రికన్ సంతతికి చెందిన ఈ పెద్ద ఎలుక ‘మగావా’ గత వారాంతంలో మృతిచెందింది. మందుపాతరల వెలికితీతలో ఈ ఆఫ్రికన్ ఎలుకలు చక్కగా పనిచేస్తాయి. అన్వేషణ దశలో పేలుడుకు అవకాశం ఇవ్వకుండా వాటిని గుర్తిస్తాయి. బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ ‘అపొపో’ ఈ విషయాన్ని వెబ్‌సైటు ద్వారా వెల్లడించింది. మందుపాతరల వంటివి వాసన ద్వారా కనుగొనేలా ఎలుకలు, కుక్కలకు ఈ సంస్థ శిక్షణ ఇస్తుంటుంది. ‘మగావా’ మృతికి ‘అపొపో’ ఘనంగా నివాళులు అర్పించింది.
Magawa news
కాంబోడియాలో అంతర్యుద్ధం పీడకలల నడుమ..
2013లో టాంజానియాలో పుట్టిన ఎలుక ‘మగావా’ను శిక్షణ అనంతరం 2016లో కాంబోడియాకు పంపారు. ఈ దేశంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు సాగిన అంతర్యుద్ధం 1998లో ముగిసింది. నాటి భయానక ఆగడాలు భూమి పొరల నుంచి వెలికితీయని మందుపాతరలు, పేలని బాంబుల రూపంలో ఇప్పటికీ ఎంతోమంది అమాయకులను బలి తీసుకొంటూనే ఉన్నాయి. తన అయిదేళ్ల సర్వీసులో మగావా వందకు పైగా మందుపాతరలను, బాంబులను వెలికితీయడంలో కీలకపాత్ర పోషించినట్లు ‘అపొపో’ తెలిపింది. గతేడాదే ఈ ఎలుకకు ‘రిటైర్మెంట్’ ఇచ్చారు. ఈ మూషికం సేవలతో కాంబోడియాలో ఎంతోమంది స్వేచ్ఛావాయువులను పీల్చుకున్నారని స్వచ్ఛందసంస్థ పేర్కొంది. ఈ సేవలకు గుర్తింపుగా 2020లో బ్రిటన్‌కు చెందిన ‘పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ అనిమల్స్’ అనే వెటర్నరీ ఛారిటీ సంస్థ నుంచి మగావా బంగారు పతకం అందుకొంది. జంతువుల విభాగంలో శౌర్య పరాక్రమాలకు ఇచ్చే అత్యున్నత అవార్డుగా దీన్ని భావిస్తారు. గతేడాది ‘రిటైర్మెంట్’ పొందాక.. కాంబోడియాలోని వాయవ్య ప్రావిన్సు సీయమ్ రీప్ చేరుకొంది మగావా. మళ్లీ అదే బోను.. అదే ఆహారం. అయిదేళ్లుగా అలవాటుపడ్డ పని మాత్రం లేదు. అల్పజీవిగా పుట్టినా.. మానవజాతికి ఎంతో సేవ చేసిన ఆ మూషికం తన జీవితం చాలించింది.
ఇదీ చదవండి: డాక్టర్ ఉన్మాదం.. రోగుల లివర్లపై పేర్లు చెక్కుతూ...