చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం..? అలాగే ఉంది కరోనా బాధిత దేశాల పరిస్థితి. కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం. ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోని అగ్రదేశాలనే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటి వరకూ దీనికి వ్యాక్సిన్ దొరకనందున ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే, ఇందుకు రువాండా మినహాయింపు. మధ్య ఆఫ్రికాలోని ఈ చిన్న దేశం కరోనా విషయంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే ఇప్పటివరకూ ఆ దేశంలోకి కరోనా ప్రవేశించలేకపోయింది. ఇందుకు ముఖ్య కారణం ఆ దేశ ప్రజలు అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా..?
చేతులు శుభ్రం చేసుకోవడం

కరోనా వైరస్ను అడ్డుకోవడంలో మొదటి మెట్టు చేతులు శుభ్రం చేసుకోవడం. రువాండా దేశంలో ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. అందుకోసం ప్రతి బస్టాపులోనూ ప్రత్యేకంగా పోర్టబుల్ వాష్ బేసిన్లు ఉంటాయి. చేతులు శుభ్రం చేస్తేనే బస్టాండులోకి ప్రవేశం సాధ్యం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు.
పరిశుభ్రతకు చట్టం

పరిశుభ్రత విషయంలో రువాండాకు ఘన చరిత్రే ఉంది. 1994లో భయంకరమైన మారణహోమంతో తీవ్రంగా దెబ్బ తిన్న ఆ దేశం.. క్రమేపీ అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికల ప్రకారం.. మధ్య ఆఫ్రికాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశాల్లో రువాండా ఒకటి. ప్రతి నెలా చివరి శనివారం రువాండా ప్రజలు ‘ఉముగాండా’ అనే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఆ రోజు అందరూ కలిసి వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రపరుస్తారు. అక్కడ ఇది చట్టం.
ప్లాస్టిక్ నిషేధం

మన దగ్గర ఇప్పటికీ అమలుకు సాధ్యం కాని ప్లాస్టిక్ సంచుల నిషేధం అక్కడ దశాబ్ద కాలం నుంచే అమల్లో ఉంది. ఈ దేశం ఆఫ్రికాలోనే పరిశుభ్రతకు కేరాఫ్ అ్రడస్.
పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణలోనూ రువాండ ఆదర్శంగా నిలుస్తోంది. వన్యప్రాణులు, ప్రకృతిని కాపాడేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోంది. అక్కడ నేరాల శాతం చాలా తక్కువ. ఆఫ్రికా ఖండంలో అత్యంత సురక్షితమైన దేశం రువాండా. ఇదిలా ఉండగా.. కరోనా భయంతో అగ్రదేశాలు సైతం విదేశీ పర్యాటకుల రాకపై నిషేధం విధించాయి. కానీ, రువాండా మాత్రం పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించడం గమనార్హం. పర్యాటకులకు సాధారణ సేవలు కొనసాగుతాయని ఆ దేశ పర్యాటక, అభివృద్ధి బోర్డు తెలిపింది.