Green Wall Africa Desert: ప్రపంచంలో ఉన్న ఎడారుల్లో సహారా ఎడారి అతి పెద్దది. 90 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ ఎడారి క్రమంగా పెరుగుతుండటం ఆఫ్రికా దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఎడారీకరణను అడ్డుకునేందుకు 20కి పైగా ఆఫ్రికా దేశాలు నడుం బిగించాయి. అందుకోసం 2007లోనే కట్టడి చర్యలను ప్రారంభించాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న 8 వేల 50 కిలోమీటర్ల పొడవున్న ఎడారి రేఖ వెంబడి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సహారా ఎడారిని నిలువరించి వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. 2030 నాటికి పశ్చిమాన సెనెగల్ నుంచి తూర్పున జిబౌటి వరకు ఉన్న విశాలమైన సాహెల్ ప్రాంతమంతా మొక్కలు పెంచాలని గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుకు 2007లో శ్రీకారం చుట్టారు.
సహకరించని వాతావరణం..
ఎడారీకరణను అడ్డుకునేందుకు వీరికి వాతావరణం సహకరించడం లేదు. గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడంతో నాటిన లక్షలాది మెుక్కలు చనిపోయాయి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో ఎంపికైన 11 దేశాల్లో మౌరిటానియా ఒకటి. అక్కడ ఇసుక దిబ్బల కింద ఇళ్లు కనుమరుగవుతుండటంతో అత్యవసర చర్యలకు ఆ దేశ సర్కారు ఉపక్రమించింది. అయితే వారికి వాతావరణ మార్పులు పెను సవాలుగా మారాయి. అక్కడ మూడేళ్లుగా వర్షాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
నీటి పారుదల వ్యవస్థకు కృషి..
ఎడారిని వెనక్కి నెట్టేందుకు తాటి చెట్లను నాటాలని వారు సంకల్పించారు. అందుకోసం బావులు తవ్వి నీటిపారుదల వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. వర్షం లేకపోవడంతో 2018 నుంచి చెట్లను పెంచేందుకు బావులను ఉపయోగిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. మౌరిటానియాలో చెట్లను నరికివేసి కలపకు ఉపయోగిస్తుండటం మరో ప్రధాన సమస్యగా చెబుతున్నారు. సౌర వ్యవస్థతో నడిచే పంపులు, నీటిపారుదల వ్యవస్థతోనే చాలా చెట్లు బతికాయని వెల్లడించారు.
భూసారం పెంచే దిశగా చర్యలు..
మరోవైపు ఎడారి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి మౌరిటానియా ప్రభుత్వం కృషి చేస్తోంది. భూసారం పెంచడం, అడవులు పెంచడం ద్వారా పర్యావరణ, సుస్థిర అభివృద్ధి సాధించవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం అక్కడి వారికి వసతులు కల్పిస్తోంది. దీనివల్ల అడవుల పెంపుతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మౌరిటానియా అటవీ, పర్యావరణ మంత్రి మేరిమ్ బెకాయే వెల్లడించారు. వాతావరణ మార్పులు ఉన్నప్పటికీ.. మెుక్కలు, ఆహారాన్ని ఎలా పెంచుకోవాలో స్థానికులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.
4,300 కోట్లు అవసరం..
Green wall Africa project: గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు లక్ష్యంలో ఇప్పటివరకు కేవలం 4 శాతమే నెరవేరింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి 4వేల 300 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి సుమారు 100 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చూడండి: చైనాలో ప్రజల ఆకలి కేకలు- కఠిన లాక్డౌన్ వల్లే...