VV Vinayak NTR Adhurs: దర్శకుడు వీవీ వినాయక్, నటుడు ఎన్టీఆర్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఈ కాంబోకు విశేష క్రేజ్ రావడానికి కారణం 'ఆది', 'సాంబ', 'అదుర్స్' అనే సినిమాలనే సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్ తన దర్శకత్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో 'అదుర్స్' ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు.
"కమర్షియల్ డైరెక్టర్ అయిన నేను, కమర్షియల్ హీరో అయిన ఎన్టీఆర్ కలిసి 'అదుర్స్' సినిమా చేయడం పెద్ద సాహసం. ఒకవేళ ఆ చిత్రం ఫెయిలై ఉంటే మా కాంబినేషన్‌కు చెడ్డపేరు వచ్చేది. ఎన్టీఆర్ ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలడు. అతడు పాన్ ఇండియా నటుడుకావడంలో నాకు ఆశ్చర్యం లేదు. ఆయన ప్రతిభ ఎలాంటిదో నాకు బాగా తెలుసు" అని వినాయక్ పేర్కొన్నారు.
'శీనయ్య' సినిమా పనులు, కొవిడ్/లాక్‌డౌన్ కారణంగా గ్యాప్ వచ్చిందని, ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న 'ఛత్రపతి' హిందీ రీమేక్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఏ సినిమా చిత్రీకరణ విషయంలోనూ తాను ఒత్తిడి గురవలేదని, తొలిసారి చిరంజీవితో 'ఠాగూర్' చిత్రం తీస్తున్నప్పుడు భయపడ్డానని వివరించారు.
'ఆది'తో దర్శకుడిగా మారిన వినాయక్ తొలి ప్రయత్నంలోనే 'నంది' అవార్డు అందుకున్నారు. 'చెన్నకేశవరెడ్డి', 'సాంబ', 'దిల్', 'లక్ష్మి', 'కృష్ణ' తదితర చిత్రాలతో తనదైన ముద్రవేశారు. 2018లో వచ్చిన 'ఇంటిలిజెంట్' తర్వాత ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'ఛత్రపతి'ను రీమేక్ చేస్తున్నారు. 'శీనయ్య' ప్రారంభమై, పలు కారణాల వల్ల ఆగిపోయింది.