టాలీవుడ్‌లో మరో విషాదం జరిగింది. ప్రముఖ ఎడిటర్, నిర్మాత జీజీ కృష్ణారావు మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులందరి దగ్గర ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 200కు పైగా చిత్రాలకు ఆయన ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్‌ల సినిమాలకు ఆయన సేవలందించారు.
కె. విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ వంటి సినిమాలతో పాటు కళాతపస్వి రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకు కృష్ణారావు పనిచేశారు. దాసరి నారాయణ రావు తెరకెక్కించిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలకు ఎడిటర్‌గా సేవలందించారు. డైరెక్టర్ కె. విశ్వనాథ్‌తో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉండేది. కృష్ణారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి తారక రత్న మరణం నుంచి కోలుకోక ముందు తెలుగు చిత్రసీమ మరో విషాద వార్తను వినాల్సి వచ్చింది. కళా తపస్వి కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించారు. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన మరుసటి రోజు ఫిబ్రవరి 3న ఆయన సినిమాల్లో పాటలకు గాను రెండుసార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్న లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ కన్ను మూశారు.