దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత హాలీవుడ్ నటులు, నిపుణుల నుంచి చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ భారీ చిత్రం.. ప్రపంచ సినిమా ప్రేక్షకులు అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ రేసులోనూ నిలుస్తుందని చాలామంది ఎప్పుడో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ వారందరికీ నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. ఈ మూవీ మరో చరిత్ర సృష్టించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ రేసులో ఈ చిత్రం దూసుకొచ్చింది. సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి షార్ట్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆస్కార్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు.
ఆ 15 పాటల్లో ఒకటిగా.. ద అకాడమీ అవార్డ్స్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్) మొత్తం 23 విభాగాల్లో అవార్డులు ఇస్తుంది. అందులో 10 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల వివరాలను తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగానే.. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పదిహేను పాటలను షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. మొత్తం 81 పాటలు ఈ విభాగంలో పోటీ పడటానికి అర్హత సాధించగా... అందులో 15 పాటలను సెలెక్ట్ చేశారు. ఆ పదిహేనులో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ ఒకటి. అయితే వీటిలో మళ్ళీ ఐదు పాటలు నామినేషన్స్‌కు వెళతాయి. ఆ తర్వాత ఐదింటిలో ఒకటి విజేతగా నిలుస్తుంది.
భారత్ నుంచి మరో మూడు... ఈ షార్ట్ లిస్ట్‌లో భారత్ నుంచి మరో ముడు చిత్రాలు నిలిచాయి. 'ఛెల్లో షో' (ద లాస్ట్ ఫిల్మ్ షో) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకోగా.. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో 'ఆల్ ద బ్రీత్స్'... బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ద ఎలిఫాంట్ విష్పరర్స్' ఈ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. కాగా, వచ్చే ఏడాది జనవరి 24న ఆస్కార్ నామినేషన్స్ వెల్లడిస్తారు.
ఇదీ చూడండి: త్వరలోనే డైరెక్టర్‌గా మూవీ తీస్తా.. కానీ అందులో నేను నటించను: అనుపమ