Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ హత్యా బెదిరింపుల వ్యవహారంపై ముంబయి పోలీసులు.. కీలక పురోగతి సాధించారు. బెదిరింపుల లేఖ విషయంలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సిద్ధేష్ కాంబ్లే అలియాస్ సౌరభ్ మహకల్(20) విచారణలో ఈ విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
"ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఆ బెదిరింపుల లేఖను సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కు పంపించాడు. అందుకోసం అతడి గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులు రాజస్థాన్‌లోని జాలోర్ నుంచి ముంబయికి వచ్చారు. అక్కడికి వచ్చి సౌరభ్ మహకల్ను కలిశారు. అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం" అని పోలీసులు గురువారం తెలిపారు.
సోమవారం సల్మాన్‌ఖాన్.. హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ముంబయి పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అయితే తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని స్టేట్మెంట్లో సల్మాన్ స్పష్టంచేశారు. ఇటీవలి కాలంలో తనకు ఎవరితోనూ గొడవలు కూడా లేవని పేర్కొన్నారు. అంతకుముందు సలీమ్ ఖాన్ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు పోలీసులు. బాంద్రాలో సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ జరిగింది: ఆదివారం ఉదయం సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్‌కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: సల్మాన్ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం