Spy First Day Collections Worldwide : కార్తీకేయ-2 పాన్ ఇండియా చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తాజాగా నటించిన చిత్రం 'స్పై'. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణం మిస్టరీ వెనక ఉన్న రహస్యాలను తెలిపే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే వరల్డ్ వైడ్‌గా విడుదలైన మొదటి రోజే నెగెటివ్ టాక్‌ను సంపాదించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కలెక్షన్స్‌లో మాత్రం దూసుకుపోతోంది. రిలీజైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.11.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా షేర్ విలువు రూ.6 కోట్లుగా ఉంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించాలంటే మరో రూ.12 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. బక్రీద్, తొలిఏకాదశి పర్వదినం రోజున విడుదల అయినందున తొలిరోజు మంచి ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుందని సినీ విశ్లేషకుల అంచనా. ఈ కలెక్షన్స్ నిఖిల్ కెరీర్లో తొలిరోజు సాధించిన అత్యధిక వసూళ్లుగా చెబుతున్నారు.
Nikhil Spy Review : చిత్రం: స్పై; నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, జీసు సేన్‌గుప్తా, అభినవ్, మకరంద్ దేశ్ పాండే, ఆర్యన్ రాజేశ్, నితిన్ మెహ్తా, రానా (అతిథి పాత్రలో..), తదితరులు; కథ: కె.రాజశేఖర్ రెడ్డి; సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్; సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్; నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్; నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి; దర్శకత్వం: గ్యారీ బీహెచ్; విడుదల తేదీ: 29-06-2023
ఇదీ కథ : జైవర్ధన్ (నిఖిల్) ఓ రా ఏజెంట్. శ్రీలంకలో పనిచేస్తుంటాడు. భారత దేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ మృతిచెందాడని అందరూ భావిస్తాడు. కానీ అతడి నుంచి నష్టం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో ఖదీర్ ఆచూకీ కోసం ప్రత్యేకమైన మిషన్‌తో జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దొరికాడా? లేక అందరూ ఊహించినట్టుగానే మృతి చెందాడా? ఈ ప్రయత్నంలో ఉన్న జై తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేశ్)ను చంపినవాళ్లను ఎలా కనుక్కున్నాడు? ఈ మిషన్‌కు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం వెనకున్న రహస్యానికీ సంబంధం ఏమిటనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే : అత్యంత రహస్యమైన కథతో రూపొందిన సినిమాగా 'స్పై' ప్రచారమైంది. నేతాజీ అదృశ్యం అనే అంశం కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కానీ మూవీ మాత్రం ఏ దశలోనూ ఆ స్థాయిని అందుకోలేకపోయింది. అంతర్జాతీయ స్థాయి, దేశభక్తితో ముడిపడిన ఇలాంటి గూఢచారి కథలకి కథనం, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు బలంగా ఉండాలి. అవి లేకపోతే కథ ఎన్ని దేశాలు చుట్టొచ్చినా వృథానే అవుతుంది. ఆ విషయాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేస్తుంది. దేశానికి ముప్పుగా మారిన ఓ కరడుగట్టిన ఉగ్రవాది, అతడిని మట్టుబెట్టేందుకు చేపట్టే ఓ మిషన్, అందులో హీరో.. ఇలా చాలా సినిమాల్లో చూసినట్టే రొటీన్ ఫార్ములాతో ఫస్ట్ హాఫ్‌లోని సన్నివేశాలు సాగిపోతాయి. ఇక సెకెండ్ హాఫ్ కూడా సగటు ప్రేక్షకుడిని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.