భాష ఏదైనా పరిచయం అక్కర్లేని కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. దక్షిణాదిలో ఆయన పేరు తెలియని వెండితెర, బుల్లితెర అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పలు టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన కొంతకాలం క్రితం కరోనా మరణించినా.. ఆయన జ్ఞాపకాలు మాత్రం.. ఇంకా పదిలంగా ఉన్నాయి. శివశంకర్ మాస్టర్ చిన్నతనంలో జరిగిన అరుదైన సంఘటన గురించి 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఏడాదిన్నర వయసున్నప్పుడు నడుము విరిగి.. 8ఏళ్లపాటు మంచానికే పరిమితమైనట్లు 'అలీతో సరదాగా' టాక్ షోలో చెప్పారు శివశంకర్ మాస్టర్.
"మా ఇల్లు చాలా పెద్దది. నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు మా పెద్దమ్మ నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని అరుగు మీద కూర్చుని పొరిగింటివారితో కబుర్లు చెప్పేది. ఓ రోజు అలా కూర్చున్న సమయంలో అనుకోకుండా ఓ ఆవు.. మా వైపుగా పరుగులు తీసింది. దీంతో ఎక్కడ ఆవు తన మీదకు వస్తుందేమో అని మా పెద్దమ్మ ఇంట్లోకి పరుగెత్తింది. అప్పుడు నేను తన చేతుల్లోనుంచి గుమ్మం మీద పడిపోయా. ఆ తర్వాత నాకు నెల రోజుల పాటు జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గడం లేదు."
-శివశంకర్ మాస్టర్
ఈ క్రమంలో తన తండ్రి విదేశాల్లో డాక్టర్‌గా పని చేసి.. మద్రాసులో స్థిరపడిన నరహింస అయ్యర్ అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ ఎక్స్ రే తీసి నడుము విరిగిందని నిర్ధరించారు. ఆ సమయంలో.. 'ఈ పిల్లాడిని నా దగ్గరికి తీసుకొస్తే మళ్లీ నడిచేలా చేస్తా' అని డాక్టర్ అయ్యర్.. చెప్పడం వల్ల మాస్టర్ నాన్న కూడా ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స పొందారు శివశంకర్ మాస్టారు. అయితే నడుము కదలకుండా ఉండేందుకు మాస్టర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్కూలు కూడా పంపకుండా ఇంట్లోనే టీచర్‌ను ఏర్పాటు చేశారు.
" నేరుగా నేను ఐదో తరగతి నుంచి స్కూలు వెళ్లడం ప్రారంభించా. నడుము సమస్య వల్ల నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎలాంటి ఆటలు ఆడలేదు. నేను బయటికి వెళ్లే వాడని కాదు. అందువల్ల నేను ఇంట్లో ఆడవాళ్ల మధ్య చాలా గారాబంగా పెరిగాను. మా నాన్న నన్ను కచేరీలకు పంపేవారు. అక్కడ డ్యాన్స్ చూసి.. నాకు నృత్యం మీద వ్యామోహం పెరిగింది."
-శివశంకర్ మాస్టర్
ఆ విధంగా శివశంకర్ మాస్టర్‌కు డ్యాన్స్‌పై ఇష్టం పెరిగి.. సొంతంగా నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం మాస్టర్ నాన్నకు తెలిసి.. ప్రోత్సహించారు. కాలం క్రమంలో శివశంకర్ మాస్టర్ వెన్నెముక అతుక్కొని.. నొప్పి తగ్గింది. ఆ తర్వాత నృత్యాన్ని ప్రాణంగా భావించి.. సాధన చేసి.. లెజండరీ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు శివశంకర్ మాస్టర్. దాదాపు 800 సినిమాలకు నృత్యరీతులను సమకూర్చారు.
ఇదీ చదవండి: ఈ 10 సినిమాల దెబ్బకు భారత బాక్సాఫీస్ షేక్.. రాజమౌళి సినిమానే టాప్