నటనతో బాక్సాఫీస్ షేక్ చేయడమే కాదు గ్రౌండ్‌లోనూ సత్తా చాటగలమంటూ సినీ తారలు ముందుకొస్తున్నారు. ఇందుకు తెలుగు, తమిళం, కన్నడ, బాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులందరూ ఒక్కటవ్వనున్నారు. ఇదంతా ప్రతిష్ఠాత్మక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం తారలు చేస్తున్న సన్నాహాలు. 2019లో చివరిసారిగా జరిగిన ఈ లీగ్ మరింత అప్డేటయ్యి 2023లో రానుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం రిలీజ్ అయ్యింది.
ఫిబ్రవరి 18న ప్రారంభమై మార్చ్ 19 వరకు కొనసాగనున్న ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కేరళ స్ట్రైకర్స్, కర్ణాటక బుల్డోజర్స్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్, పంజాబ్ దే షేర్స్ అనే పేర్లతో సిద్ధమైన టీమ్స్ మైదానంలో విజృంభించనున్నాయి. కాగా తెలుగు టీమ్‌కు అక్కినేని అఖిల్, కన్నడ టీమ్‌కు కిచ్చా సుదీప్, చెన్నై టీమ్‌కు ఆర్య కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
మరోవైపు బాలీవుడ్ టీమ్‌కు సల్మాన్‌ఖాన్, కేరళ టీమ్‌కు మోహన్‌లాల్, తెలుగు టీమ్‌కు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించనుతున్నారు. బెంగాల్ టైగర్స్ - కర్ణాటక బుల్డోజర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. అదే రోజు చెన్నై రినోస్తో ముంబాయి హీరోస్ టీమ్ పోటీపడనుంది. కాగా ఫిబ్రవరి 19న కేరళ స్ట్రైకర్స్‌తో తెలుగు వారియర్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లకు లక్నో, జైపూర్, బెంగళూరు, త్రివేండ్రం, జోధ్‌పూర్, హైదరాబాద్ వేదిక కానున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం హైదరాబాద్‌లో జరగనుంది.