చిత్రసీమ డెత్ సీజన్‌గా భావించే ఫిబ్రవరి రెండేళ్లుగా సూపర్ హిట్‌గా నిలుస్తూ వస్తోంది. 'జాంబిరెడ్డి', 'ఉప్పెన', 'నాంది', 'డీజే టిల్లు', 'భీమ్లానాయక్' లాంటి చిత్రాలన్నీ ఫిబ్రవరిలోనే బాక్సాఫీస్ బరిలో దిగి హిట్టు మాట వినిపించాయి. ఈ విజయాలిచ్చిన స్ఫూర్తితోనే ఇప్పుడదే తరహాలో అన్ సీజన్‌లో అదరగొట్టేందుకు మరోసారి చిత్రసీమ సిద్ధమైంది. 'బుట్టబొమ్మ', 'హంట్' చిత్రాలతో జనవరి ముగియనుండగా.. సందీప్ కిషన్ 'మైఖేల్'తో, సుహాస్ 'రైటర్ పద్మభూషణ్'తో ఫిబ్రవరికి స్వాగతం పలకనున్నారు. 'మైఖేల్'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది సందీప్‌కు తొలి పాన్ ఇండియా సినిమా కావడం.. ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషించడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రంజిత్ జయకొడి ముస్తాబు చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఇక అదే రోజు వస్తున్న సుహాస్ 'రైటర్ పద్మభూషణ్'ను షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించారు.
''జగత్ జజ్జరిక'' అంటూ గతేడాది 'బింబిసార'తో బాక్సాఫీస్ ముందు మెరుపులు మెరిపించారు కథానాయకుడు కల్యాణ్‌రామ్. ఇప్పుడా ఉత్సాహంలోనే 'అమిగోస్'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో 'అమిగోస్' చిత్ర ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని ''యెక యెక..'' గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఇదే తేదీకి 'పాప్‌కార్న్' అనే ఓ చిన్న చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకోనుంది. అవికా గోర్ - సాయిరోనక్ జంటగా మురళి గంధం తెరకెక్కించారు.
శివరాత్రికి సినిమాలే సినిమాలు..
తెలుగు చిత్రసీమకు ఈ శివరాత్రి మరింత ప్రత్యేకంగా మారనుంది. ఒకేసారి నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుండటమే దీనికి కారణం. అందులో మూడు సినిమాలు ఒకేసారి పలు భాషల్లో విడుదల కానుండటం మరింత ఆసక్తిరేకెత్తిస్తోంది. ధనుష్ 'సార్'తో, సమంత 'శాకుంతలం'తో, విష్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ'తో, కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ'తో శివరాత్రి బరిలో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
ఇందులో వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'సార్' ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా.. గుణశేఖర్ 'శాకుంతలం', విష్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'దాస్ కా ధమ్కీ' పాన్ ఇండియా స్థాయిలో ఏకకాలంలో పలు భాషల్లో ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. మురళీ కిషోర్ తెరకెక్కించిన 'వినరో భాగ్యము విష్ణుకథ' మాత్రం తెలుగుకే పరిమితం కానుంది. ఈ చిత్రాలన్నింటిపైనా ఇటు సినీప్రియుల్లోనూ.. అటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలున్నాయి.
ముఖ్యంగా 'శాకుంతలం'పై సామ్ - గుణశేఖర్ టీమ్ భారీ అంచనాలే పెట్టుకుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా రూపొందించిన ఈ ప్రేమ కావ్యాన్ని భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో రూపొందించారు గుణశేఖర్. ఇందులో సమంత టైటిల్ పాత్రలో నటించగా.. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ బాలనటిగా తెరకు పరిచయం కానుంది.
వీటి దారెటో..
ఫిబ్రవరి తొలి మూడు వారాల బెర్తులు ఇప్పటికే ఖరారైనప్పటికీ.. నాలుగో వారం విడుదలలపై ఇంత వరకు స్పష్టత రాలేదు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'రంగమార్తాండ' ఇప్పటికే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 'పలాస'తో ప్రేక్షకుల్ని మెప్పించిన రక్షిత్ అట్లూరి 'శశివదనే'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. మోహన్ ఉబ్బన తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి నాలుగో వారంలోనే బాక్సాఫీస్ బరిలో నిలవనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన 'బెదురులంక', సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న 'టిల్లు స్క్వేర్' మార్చి తొలి రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.