పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' సినిమాకు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు అడ్వకేట్ రాజ్ గౌరవ్. 'సినిమా విడుదల పోస్ట్ పోన్ అయింది. నేను అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిపై చిత్ర యూనిట్ స్పందించింది. సినిమాలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు నాకు తెలిసింది. అందుకే ఇంజక్షన్ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటున్నాను' అని పిటిషనర్ తెలిపినట్లు జడ్జి పిటిషన్‌ను కొట్టివేశారు.
ఇదీ జరిగింది..
'ఆదిపురుష్' సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ గతేడాది దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడు, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి అసమంజసమైన ధోరణిలో చూపించారని పిటిషనర్లు ఆరోపించారు. రావణుడ్ని కూడా తప్పుగా చూపించారని అందులో పేర్కొన్నారు. రామాయణ పురాణాన్ని వక్రీకరించారని ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్, డైరెక్టర్, సహ నిర్మాత ఓం రౌత్ మీద.. అడ్వకేట్ రాజ్ గౌరవ్ కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా విడుదలను ఆపేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ఇంజక్షన్ పిటిషన్లో కోరారు.
"ఆదిపురుష్ సినిమా టీజర్లో రాముడిని, హనుమంతుడ్ని తప్పుగా చూపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. రాముడు సౌమ్య స్వభావం, క్షమా గుణం గలవాడు. అలాంటి పురాణ పురుషుడిని తోలు పట్టీలు, పాద రక్షలు ధరించిన వాడిగా చూపించారు. దారుణాలు చేసే వారిలాగా, ప్రతీకారం తీర్చుకునేవాడిలాగా, కోపంగా చూపించారు. మరోవైపు గొప్ప శివ భక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడిని కూడా చాలా చీప్‌గా, భయంకరంగా చూపించారు. ఈ సినిమా టీజర్ చాలా దారుణంగా ఉంది. మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తోంది. దీని కారణంగా జనవరి 12 2023న విడుదల కానున్న ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలి. భారత్‌తో సహా ఇతర ప్రాంతాలలోని హిందువుల ఆకాంక్షలు, మనోభావాలను కాపాడాలి" అని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే విడుదలైన ఆదిపురుష్ టీజర్‌ను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ ద్వారా కోరారు.
అయితే, అప్పట్లో ఈ టీజర్ విడుదలైనప్పడు.. 'ఆదిపురుష్'పై ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. వీఎఫ్ఎక్స్ బాగోలేదంటూ.. రాముడు, ఆంజనేయుడు, రావణుడ్ని తప్పుగా చిత్రీకరించారంటూ విపరీతంగా విమర్శలు వచ్చాయి. వీటిపై సినిమా దర్శకుడు ఓం రౌత్ వివరణ కూడా వివరణ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద స్క్రీన్ కోసం తీశామని.. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని.. కావాలంటే నోట్ రాసిస్తానని చెప్పారు.