తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన నటి రవీనా టాండన్. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ నటి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించేందుకు, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నో చెప్పినందుకు తనపై అహంకారి అనే ముద్ర పడిందంటూ తన కేరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చారు. కొన్ని విషయాల్లో తాను అసౌకర్యంగా ఉండేదాన్నని.. డ్యాన్స్ విషయంలో.. ఇంబ్బంది కరంగా ఫీలైన స్టెప్పును నేను చేయనని నిక్కచ్చిగా చెప్పేదాన్నని తెలిపారు. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించాలని తానెప్పుడూ అనుకోలేదని.. అందుకే ముద్దులు ఉండే సన్నివేశాల్లో నటించలేదని తెలిపారు. ఆ కారణంగానే తనపై అహంకారి అనే ముద్ర పడిందని గుర్తుచేసుకున్నారు.
"నేను రెండు రేప్ సీన్లలో నటించాను. అయినప్పటికీ ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. కాస్ట్యూమ్‌పై ఒక్క చిరుగూ లేకుండా రేప్ సన్నివేశాలలో నటించిన నటిని నేనొక్కదాన్నే. అంతలా నా డ్రెస్సులు చెక్కుచెదరకుండా ఉండేవి"
-- రవీనా టాండన్, బాలీవుడ్ నటి
'నేను వదులుకున్న సినిమాలివే..'
కాగా, ఓ సమయంలో బాడీ షేమింగ్ ట్రోల్స్ సైతం ఎదుర్కొన్నానని వెల్లడించారు. దాంతో పాటు పలు సినిమాలను సైతం వదులు కున్నట్లు తేలిపారు. 1993లో వచ్చిన 'డర్' అవకాశం ముందుగా తనకే వచ్చిందని చెప్పింది. అందులో అసభ్యకర సన్నివేశాలు లేవని.. కానీ కొన్ని సీన్స్ ఎందుకో తనకు అసౌకర్యంగా అనిపించాయని తెలిపారు. ఇక స్విమ్మింగ్ డ్రెస్సులు ధరించనని దర్శక, నిర్మాతలకు చెప్పేశానని అన్నారు. కరిష్మా కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన 1991లో వచ్చిన 'ప్రేమ్ ఖైదీ' సినిమా కోసం ముందుగా తనను సంప్రదించారని తెలిపారు. అందులోని హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ సీన్ తనకు నచ్చలేదని.. అందుకే ఆ మూవీని కూడా వదిలేశానని అని రవీనా టాండన్ వెల్లడించారు.
తెలుగులోనూ మెరిసిన రవీనా..
'పత్తార్ కే ఫూల్' అనే హిందీ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రవీనా టాండన్.. 'రథ సారథి' అని సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'బంగారు బుల్లోడు', 'ఆకాశ వీధిలో' నటించారు. మంచు మనోజ్ నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద'లో రవీనా టాండన్ ప్రధాన పాత్ర పోషించారు. అనంతరం సంచలని చిత్రం 'కేజీయఫ్ ఛాప్టర్ 2'లో మరోసారి ఇక్కడి దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందులో పోషించిన ప్రధాని రమీకా సేన్ పాత్ర ఆమెకు విశేష గుర్తింపు తీసుకువచ్చింది. రవీనా సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఆమెకు పద్మశ్రీ ప్రకటించింది.