Tarak ratna vs NTR: నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని అలరించారు. తాజాగా ఆయన నటించిన సరికొత్త వెబ్ సిరీస్ '9 అవర్స్'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ రచించిన '9 అవర్స్'లో తానూ భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"నాకు సోషల్‌మీడియా అంటే ఇష్టం ఉండదు. ఎవరితోనైనా డైరెక్ట్‌గానే మాట్లాడటానికే ఇష్టపడుతుంటాను. అందుకే ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనూ నాకు ఖాతాల్లోవు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ సినిమాల్లో నేను మెయిన్ విలన్‌గా నటిస్తున్నానని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. నా పేరుతో ఉన్న ఓ ఫేక్ ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్ రావడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. నిజం చెప్పాలంటే, ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. ఇప్పటివరకూ ఆ చిత్రబృందం నన్ను సంప్రదించలేదు. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమాలో యాక్ట్ చేస్తాను" అని తారకరత్న అన్నారు.
అనంతరం విలేకరి మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలోనే మీరూ పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌కి పోటీగానే తారకరత్న సినిమాల్లోకి వచ్చారని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అందులో నిజమెంత?’’ అని ప్రశ్నించగా.. ‘‘అవన్నీ అవాస్తవాలే. తమ్ముడు ఎన్టీఆర్ 2001లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆయన తర్వాతే నేను పరిశ్రమలోకి వచ్చాను. ఆ సమయంలో అందరూ ఎన్టీఆర్‌కు పోటీగానే తారకరత్నను సినిమాల్లోకి తీసుకువచ్చారు అనుకున్నారు. అందులో నిజం లేదు. నేను ఎప్పుడూ పోటీ అనుకోలేదు. ఆనాటి నుంచే నేను దీన్ని క్లియర్ చేయాలనుకున్నా. కానీ కుదరలేదు. నేను పరిశ్రమలోకి వచ్చే సమయానికే తమ్ముడు 'ఆది' లాంటి పెద్ద హిట్స్ అందుకున్నారు. తారక్ పెద్ద నటుడు. మేమంతా నందమూరి బిడ్డలమే. ఈ రోజుకీ మా ఫ్యామిలీ పేరు అభిమానుల్లో అలా నిలబడి ఉందంటే దానికి తారక్ కూడా ఒక కారణం. నటుడు కావాలనేది నా కల. దానికి నాన్న, బాబాయ్ సపోర్ట్ చేశారు. తమ్ముడు విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నా. మా మధ్య మంచి అనుబంధం ఉంది. అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. సరదాగా జోక్స్ వేసుకుంటాం" అని తారకరత్న వివరించారు.
ఇదీ చూడండి: 'ఇండియన్-2'పై కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. 'ఎన్టీఆర్ 31' టైటిల్ ఇదే!