హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో ఆదివారం రాత్రి... ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పార్కులోని ఓ చిన్నపాటి చెరువులో దూకి బలవన్మరణానికి యత్నించాడు. నీటి శబ్దానికి పార్కు సిబ్బంది హుటాహుటిన వెళ్లి చూశారు. యువకుడు నీటిలో మునుగుతూ కనిపించగా... బయటకు లాగి ప్రాణాలు కాపాడారు.
అనంతరం అతన్ని విచారించగా... తాను ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన మహేశ్రెడ్డిగా తెలిపాడు. నిద్రలేమితో బాధపడుతున్నానని... అందువల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నానని వివరించాడు. రాత్రి సమయంలో ప్రహరీ గోడ దూకి పార్కులోకి ప్రవేశించినట్లు పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చిన బాధితుడు... తన మిత్రుడి వద్ద ఉంటున్నట్లు తెలిపాడు. వివరాలు తెలుసుకున్న తర్వాత... మహేశ్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.