ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా భవిష్యనిధికి సంబంధించిన డబ్బుల గురించి సరిగా సమాధానం చెప్పలేదనే కారణంతో ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్‌లోని గౌతంనగర్ సామాజిక భవనం సమీపంలో నివసించే సంగీత(45) అపొలో ఆస్పత్రిలోని ఏఆర్‌ఐ కార్యాలయంలో హౌజ్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందారు. కుమారుడితో కలిసి ఉంటున్న ఆమె అయిదేళ్లుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఉద్యోగంలో నుంచి తొలగించారు. తన భవిష్యనిధి గురించి కార్యాలయానికి వెళ్లి విచారిస్తున్నా ఫలితం లేదు.
ఆమెకు ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో అదే మనసులో పెట్టుకొని అనారోగ్యం బారిన పడింది. మానసికంగా కుంగిపోయిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. కేకలు విన్న ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రావిడెంట్ ఫండ్ విషయంలోనే తాను మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ