Vanama Raghavendra Rao: రాజకీయం నీడన సాగే చాటుమాటు అరాచకాలకు పరాకాష్ట ఇది.. అధికారం మాటున ఓ సామాన్యుడి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా.. ఆస్తి వివాదానికి బాధితుడి భార్యను పణంగా పెట్టమన్న దారుణమిది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో తాజాగా ఈ నెల 3న మండిగ నాగ రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు అసలు కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ (59) అని తేలింది. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ఆత్మహత్యతో పాటు భార్యా బిడ్డల్ని సైతం చంపుకునేందుకు రాఘవేంద్రరావు బెదిరింపులే కారణమని బాధితుడు ఆ వీడియోలో ఆరోపించటంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ భాజపా, కాంగ్రెస్ ఆందోళనకు దిగాయి. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఉదంతం అనంతరం రాఘవ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి శాసనసభ్యుడు, మాజీ మంత్రి కావడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతగా పట్టు ఉండటంతో నియోజకవర్గంలో రాఘవ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. తన నియోజకవర్గంలో ఏ అధికారులు పనిచేయాలన్నది అతడే నిర్ణయిస్తాడని, అతడి ఆశీస్సులు లేకుండా పోలీసులకు ఎక్కడా పోస్టింగులు దక్కవని స్థానికులు చెబుతుంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా అధికారులు ఇతడు ఏ అరాచకాలకు పాల్పడినా నోరు మెదపరనేది బాధితుల ఆరోపణ. వారి ఉదాసీనతే 4 నిండు ప్రాణాలను బలి తీసుకుందనేది తాజా ఆరోపణ.
విలన్ పాత్రలకు నకలు
వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ దాదాపు మూడు దశాబ్దాలుగా కొత్తగూడెం కేంద్రంగా ఆయన సాగిస్తున్న ఆగడాలకు అడ్డేలేదు. వాటిని చూస్తే సినిమాల్లో చూపించే విలన్ పాత్రలెన్నో గుర్తుకొస్తాయి. ఆయన వేలుపెట్టని వివాదమే ఉండదంటే అతిశయోక్తికాదు. తండ్రి వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యుడు కావడం, కొంతకాలం మంత్రిగా కూడా పనిచేసి ఉండటంతో అధికార యంత్రాంగం కూడా రాఘవేంద్రరావు కొమ్ము కాసేదనేది నిర్వివాదాంశం. అధికారికంగా రాఘవపై ఆరు కేసులే నమోదయ్యాయి. కానీ నమోదు కాని దురాగతాలకు లెక్కేలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయన అరాచకాలపై పెద్ద చర్చే జరుగుతుంటుంది. తండ్రి శాసనసభ్యుడిగా ఎన్నికయిప్పటి నుంచీ తన నియోజకవర్గం పరిధిలో అధికారుల బదిలీలు మొదలు భూవివాదాలు, ఆస్తి వ్యవహారాలే కాదు.. చివరకు వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ కలహాల్లో కూడా తలదూర్చేవాడన్న ఆరోపణలెన్నో ఉన్నాయి.
నాటి నుంచే ఆగడాలు..
- రాఘవపై 2006లో అధికారికంగా మొదట కేసు నమోదైంది. అంతకు దాదాపు దశాబ్దంన్నర ముందు నుంచే అతని ఆగడాలు మొదలయ్యాయి.
- 2006లో పాలకోయ తండాలో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైంది. వాటిని తొలగించేందుకు రెవెన్యూ, పురపాలక అధికారులు వెళ్లారు. అక్కడకు వచ్చిన రాఘవ వారితో దురుసుగా ప్రవర్తించడంతో తొలి కేసు నమోదైంది. ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది.
- 2013లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మద్యం, డబ్బులు పంపిణీపై రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆపినా పట్టించుకోకుండా వాహనంలో దూసుకెళ్లారు. ఇదే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తుండగా అడ్డుకోబోయిన ప్రభుత్వ ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించాడు. ఈ దౌర్జన్యంపై మరో కేసు నమోదు కాగా న్యాయస్థానంలో విచారణ తర్వాత కొట్టేశారు.
- 2017లో ఓ ధర్నా సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసు ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది.
- 2020లో పాల్వంచ సోనియానగర్‌లో భూక్యా జ్యోతి అనే మహిళకు చెందిన భూ వివాదంలో ఎమ్మెల్యే తనయుడు జోక్యం చేసుకోవడం రచ్చకు దారితీసింది. జ్యోతిపై అతడి అనుచరులు దాడిచేయగా తీవ్రంగా గాయపడింది. బాధితురాలు మంత్రి సత్యవతి రాథోడ్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా పోలీసులు దిగొచ్చి కేసు నమోదు చేయక తప్పలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
వడ్డీ వ్యాపారి ఆత్మహత్య
- 2021 జులైలో పాల్వంచకు చెందిన వడ్డీ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు రూ. 50 లక్షలకు చిట్టీ పాడారు. నిర్వాహకుడు డబ్బుకు బదులు స్థానిక బొల్లోజుగూడెంలో ప్లాటును రాసిచ్చాడు. అదే స్థలాన్ని మరో వ్యక్తికీ రాసివ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఉదంతంలో రాఘవ బెదిరింపులతో బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలున్నాయి. జైలుకెళ్లిన వెంకటేశ్వర్లు బయటకు వచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం వనమా కుమారుడేనని లేఖ రాశాడు.
- తాజాగా పాతపాల్వంచలో రాఘవ కారణంగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది.
పోలీసు, న్యాయ వ్యవస్థకు సహకరిస్తా: వనమా
రామకృష్ణ ఆత్మహత్య ఉదంతం దిగ్భ్రాంతికి గురిచేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ‘బాధితుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో నన్నెంతో కలచివేసింది. ఆయన నా కుమారుడిపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులన్నింటిలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేంత వరకు నా కుమారుడిని నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఓ ఎమ్మెల్యేగా, బాధ్యతగల తండ్రిగా నిర్ణయించాను. పోలీసులు, న్యాయ వ్యవస్థకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తా. నేనే రాఘవేంద్రరావును పోలీసులకు అప్పగిస్తాను. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు తెరాసలో కొనసాగుతున్నా నా తనయుడు ఓ సామాన్య కార్యకర్తగానే ఉన్నాడు. అతడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నేనెప్పుడూ ఏ వ్యవస్థనూ ప్రభావితం చేయలేదు’ అని నియోజకవర్గ ప్రజలకు ఓ బహిరంగ లేఖలో తెలిపారు.
పోలీసుల అదుపులో రాఘవ?
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు ప్రధాన కారకుడిగా కేసు నమోదైన వనమా రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని కొత్తగూడెం తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొంతమంది తెరాస నేతలు స్వయంగా పోలీసులకు అతడిని అప్పగించినట్లు తెలిసింది. గురువారం రాత్రి కొత్తగూడెం తీసుకొచ్చి శుక్రవారం ఉదయాన్నే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
ఇంకా దొరకలేదన్న ఏఎస్పీ..
రాఘవేంద్రరావు ఇంకా తమకు దొరకలేదని గురువారం రాత్రి ఏఎస్పీ రోహిత్‌రాజ్ విలేకరులకు చెప్పారు. అతని కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతడిపై అభియోగాలకు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామన్నారు.
సంబంధిత కథనాలు..