No safety for Women in KBR park: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. గుర్తు తెలియని దుండగులు మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వాక్ వేలో శనివారం ఉదయం ఓ దుండగుడు.. మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం ఉదయం 5 గంటల 45నిమిషాల సమయంలో కేబీఆర్ పార్కుకు ఓ మహిళ తన భర్తతో కలిసి వాకింగ్‌కు వెళ్లారు. కాసేపటికి వాక్ వే లో వాకింగ్ చేస్తున్న మహిళను దుండగుడు వెంబడించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి వచ్చారు. ఆ లోపే దుండగుడు పారిపోయాడు. అనంతరం బాధితురాలు భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఇటీవల నటి షాలు చౌరాసియాపై ఓ ఆగంతుకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన తెలిసిందే. రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లి వస్తున్న తనపై.. గుర్తు తెలియని వ్యక్తి దాడికి యత్నించాడు. చౌరాసియా ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ఇదీ చదవండి: Live Video: అందరూ చూస్తుండగానే రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య