భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనుల మృతి చెందారు. ములకలపల్లి మండలం మాదారం అటవీప్రాంతంలో కొన్నాళ్లుగా వేటగాళ్లు యథేచ్ఛగా జంతువుల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వేటగాళ్లు మాదారం అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ఉదయమైనా వాటిని తొలగించలేదు. ఇదే సమయంలో మొగరాలకుప్పకు చెందిన ఐదుమంది గిరిజనులు వంటచెరుకు కోసం అడవిలోకి వెళ్లారు.
కరెంట్ తీగలను గమనించని పాయం జాన్‌బాబు(24), కూరం దుర్గారావు(35) విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలారు. సహచరులు కరెంట్ షాక్‌తో కొట్టుకుంటూ చనిపోవడం చూసి... తోటివారు భయంతో పరుగులు తీశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి విద్యుత్ తీగలను తొలగించారు. మృతదేహాలను అటవీ ప్రాంతం నుంచి ములకలపల్లికి తరలించారు. వేటగాళ్లు ఇష్టం వచ్చినట్లు విద్యుత్ తీగలు అమర్చి అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.