భూమి కొనుగోలు కోసం రూ.50 లక్షలతో బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన ఘటన మంథని ప్రాంతంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామ రేషన్ డీలర్ చిప్ప రాజేశం, లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత మల్లయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారాంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బులు చెల్లించి పొలం రిజిస్ట్రేషన్‌కు బయలుదేరగా కనిపించకుండా పోయారు.
ఎకరాకు రూ.10 లక్షలు డిమాండ్
ఐదేళ్ల క్రితం ఓ మహిళ వద్ద సుమారు 22 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలుకు ఎకరాకు రూ3.50 లక్షలకు మాట్లాడుకుని కొంత డబ్బులు చెల్లించారు. భూమి రిజిస్ట్రేషన్ చేయమని యజమానురాలిని అడగగా ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వాలని మహిళ, ఆమె కుమారులు డిమాండ్ చేశారు. చివరకు రూ.9 లక్షలకు ఇరువైపులా అంగీకారం కుదిరింది. ఇప్పటి వరకు రాజేశం, మల్లయ్య ఇద్దరు కలిసి రూ.30 లక్షలకు పైగా ముట్టజెప్పారు.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని...
మిగిలిన రూ.50 లక్షలు ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేసుకుందామని ద్విచక్రవాహనంపై ఇద్దరు బయలుదేరారు. మల్లయ్య ఇద్దరు కుమారులు వీరి వెనకాలే మరొక బైక్‌పై బయలుదేరారు. కానీ వీరికి ఎక్కడ కూడా వారు కనిపించకపోవడంతో కాటారం వరకు వెళ్లి తిరిగి వచ్చారు. వారి ఫోన్లు ఆఫ్ చేసి ఉండటం.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న రామగిరి పోలీసులు వారికోసం గాలించగా... మంథని-కాటారం ప్రధాన రహదారిపై బట్టుపల్లి అటవీప్రాంతంలో రాజేశం ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉండడం పోలీసులు గమనించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ పిలిపించి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.