ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, ఓ కారు డ్రైవరు కలిసి పంట రుణాల్లో గోల్మాల్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇందుకు వేదికైంది. రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పాసుపుస్తకాలు, సొంతంగా తయారు చేయించిన స్టాంపులతో డ్రైవరు కథంతా నడిపించగా బ్యాంకు మేనేజర్లు క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కమీషన్ల కోసం రూ.2 కోట్లు రుణాలుగా ఇచ్చేశారు. ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్ ఫిబ్రవరి 3న ఈ అక్రమాలను గుర్తించారు. పోలీసులు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా ఐదుగురు పరారీలో ఉన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌లో శుక్రవారం సీపీ సత్యనారాయణ ఈ వివరాలు వెల్లడించారు.
నకిలీ పత్రాలు సృష్టించి
2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్ కారు డ్రైవర్‌గా పనిచేసిన ప్రభాకర్ పంట రుణాలు తీసుకోవడానికి ఏ పత్రాలు అవసరమో అవగాహన పెంచుకున్నాడు. ముత్తారం మండలం మైదంబడ్డ గ్రామానికి చెందిన అతడు పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించాడు. ముత్తారం తహసీల్దార్ కార్యాలయం ముందు జిరాక్స్ దుకాణం నడిపే కుక్కడపు అశోక్‌ను సంప్రదించాడు. రబ్బర్ స్టాంపుల కోసం పెద్దపల్లి శ్రీ రాజరాజేశ్వర రబ్బర్ స్టాంప్స్ దుకాణం నడిపే బ్రహ్మండ్లపల్లి సుధాకర్‌ను కలిశాడు. అతని వద్ద ఆర్డీవో, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, వీఆర్వో స్టాంపులు తయారు చేయించాడు. పట్టా పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం మంథని ఆర్డీవో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సదానందంతో చేతులు కలిపాడు.
రుణాలు మాఫీ చేస్తుందని ప్రచారం
ప్రభాకర్ ముత్తారం, రామగిరి మండలాల్లో తనకు తెలిసిన వారికి పంట రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని ప్రచారం చేశాడు. మొత్తం 153 మందికి ఇలా అప్పులు ఇప్పించాడు. ఒక్కో రుణానికి రూ.5,000 కమీషన్ ఇస్తానని చెప్పి అప్పట్లో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన రామానుజాచార్య, వెంకటేశ్వర్లుతో బేరం కుదుర్చుకున్నాడు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే ఒక్కొక్కరికి రూ.లక్ష పంట రుణం ఇచ్చారు. ప్రభాకర్‌కు సహకరించి రుణాలు ఇప్పించిన రవీందర్, శ్రీనివాస్, ప్రవీణ్, అనిల్‌కుమార్, భూమయ్య, సత్యనారాయణ, సదానందం, అశోక్, సదన్న, శివకుమార్, రాజేందర్‌లను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. నాటి బ్యాంకు మేనేజర్లు రామానుజాచార్య, వెంకటేశ్వర్లు సహా అయిదుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.5,55,000 నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బర్ స్టాంపులు తదితరమైనవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు...12 మంది అరెస్టు