TikTok famous girl honey trap :: అందం.. అభినయం.. హావభావాలతో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకున్న ఆ యువతి.. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాల బాటపట్టింది. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి డబ్బు వసూలు చేస్తున్న పరసా తనుశ్రీ(23), ఆమెకు సహకరిస్తున్న పరసా రవితేజ(32)ను అరెస్టు చేసినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ తెలిపారు. ఫాలోవర్లను వారు మోసగిస్తున్న తీరును ఆయన వివరించారు.
సులువుగా సంపాదించాలని..: ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు ఖాతాల ద్వారా సినిమా పాటలు, సంభాషణలు అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేసేది. ఈ ఖాతాలను కొన్ని వేలమంది అనుసరిస్తూ కామెంట్లు చేసేవారు. కృష్ణా జిల్లాకు చెందిన పరసా రవితేజతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. కామెంట్లు పెట్టేవారికి తిరిగి వ్యక్తిగతంగా సందేశాలు పంపించేది.
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం తదితర కారణాలు చెప్పి 8 నెలల్లో రూ.31.66 లక్షలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన ఆ యువకుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇవీ చదవండి: