ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి మద్యంలో విషం కలిపిన ఘనటలో ముగ్గురు మృతి చెందారు. విషం కలిపిన వ్యక్తి ఇంటిపై మృతుల బంధువులు దాడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. బంధువులు తాగిన మద్యంలో సైనెడ్ కల్పినట్లు నిర్ధరణ అయింది. పాతకక్షలతో ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా సైనెడ్ కల్పినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు చిన్నా.. ప్రస్తుతం ఖమ్మం పీఎస్‌లో ఉన్నాడు.
ఏం జరిగింది..?
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రతండాకు చెందిన బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్ పది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు శనివారం పెద్ద కర్మ నిర్వహించారు. బంధువులు, తండావాసులకు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది భోజనాలు చేశారు. అయితే సమీప బంధువులైన బోడ హరిదాసు, బోడ మల్సూరు బోడ భద్రుతోపాటు మరో నలుగురు.. వ్యవసాయ పనులకు వెళ్లటం వల్ల మధ్యాహ్నం విందుకు హాజరుకాలేదు. సాయంత్రం విందుకు వెళ్లిన వారికి మద్యం ఏర్పాటు చేశారు. మద్యం తాగిన వారిలో ముగ్గురు కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు ముగ్గురు ప్రాణాలు విడిచారు.
ఏడుగురు తింటే.. ముగ్గురు మృతి
బోడ హరిదాసు, బోడ భద్రు మార్గమద్యంలో మృత్యువాతపడగా... మల్సూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే ఘటనలో మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఎవరు చనిపోయారో.. ఎవరి బతికి ఉన్నారో చాలా సమయం వరకు తెలియక బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విందుకు మొత్తం ఏడుగురు వెళ్లగా ముగ్గురు మృతి చెందారు. విందు భోజనాలు ఏర్పాటు చేసిన బోడ భిక్షం కుటుంబీకులు.. శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: Unnatural Sexual Offence: గేదెతో కామాంధుడు సెక్స్.. చితకబాదిన స్థానికులు