హైదరాబాద్‌తో పాటు పలు పరిసర ప్రాంతాల్లో.. సుమారు వంద చోరీలకు పాల్పడిన ఓ గజదొంగను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 10.2 లక్షల విలువైన బంగారు, 95 తులాల వెండి ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు.. జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం..
అమీర్‌పేట్ ఎల్లారెడ్డి గూడకు చెందిన మహమూద్ ఇబ్రహీం సిద్దీఖీ(58) తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఈ చోరీలు చేసేవాడు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు, సంగారెడ్డి జిల్లా, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 87చోరీలకు పాల్పడ్డాడు. ఆయా కేసుల్లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. 2019లో జైలు నుంచి విడుదలయ్యాక.. కర్ణాటకలోని బీదర్‌కు తన మకాం మార్చాడు.
వారాంతాలలో బీదర్ నుంచి బస్సులో కేపీహెచ్‌బీ, చందానగర్, పఠాన్ చెరువు ప్రాంతాలకు వస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించేవాడు. అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు. ఈ విధంగా మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 11చోరీలకు పాల్పడ్డాడు.
ఇబ్రహీం సిద్దీఖీని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు.
ఇదీ చదవండి: 'వినియోగదారుల్లా వస్తారు... ఆభరణాలు దోచేస్తారు'