తల్లి కళ్ల ముందే భవనంపై నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాంపురం గ్రామానికి చెందిన తిరుపతయ్య, సున్తానమ్మ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. సుమారు 15 ఏళ్ల క్రితం భర్త మరణించడంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. ఐదు సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులతో కలిసి నగరానికి వచ్చి ఐడీఐ బొల్లారంలో నివాసముంటోంది. ఆమె, కుమారుడు శ్రీకాంత్(23) భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఇలా జరిగింది?
మల్లంపేట ఆకాష్ లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల భవనానికి లేబర్ కాంట్రాక్టర్‌గా గోవింద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతని వద్ద కూలీలుగా తల్లి, కుమారుడితో పాటు వారి బంధువులు పనిచేస్తున్నారు. ఆదివారం భవనం ఏడో అంతస్తులో స్లాబ్ వేస్తున్న క్రమంలో కింద నుంచి పై అంతస్తుకి కాంక్రీట్ మిక్చర్‌ను తీసుకెళ్లే పరికరం ఆరో అంతస్తు వద్ద ఆగిపోయింది. దీంతో కాంక్రీట్ మిక్చర్‌ను తీసుకెళ్లే తొట్టెలో కూర్చొని యువకుడు మరమ్మతులు చేస్తుండగా.. వైరు తెగి అతని మెడకు చుట్టుకొని పై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
కన్నీరుమున్నీరుగా..
అదే భవనంలో పనిచేస్తున్న తల్లి కళ్లెదుటే కుమారుడు కిందపడడంతో ఆమె కుప్పకూలింది. కుమారుడి మృతదేహం వద్ద ఆమె విలపించిన తీరు తోటి కార్మికులతో కంటతడి పెట్టించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని.. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లనీయమని కార్మికులు ఆందోళన చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారితో మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: accident : లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. 30 మందికి తీవ్ర గాయాలు