పరిహారం కోసం అధికారులు, పోలీసుల చుట్టూ తిరిగిన ఆ రైతు.. వారి నుంచి స్పందన రాకపోవడంతో సెల్‌టవర్(cell tower) ఎక్కి హల్చల్ సృష్టించారు. దాదాపు 9 గంటల పాటు టవర్ పైనే అతను.. ఎట్టకేలకు కిందికి దిగారు. దీంతో కుటుంబ సభ్యులు, అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈ ఘటన జరిగింది. సింగరేణి సంస్థ ఉపరితల గని విస్తరణలో భాగంగా తన వ్యవసాయ భూమి పోయిందని మూడేళ్లుగా సుందర్ లాల్ అనే రైతు ఆ సంస్థ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదనే ఆవేదనతో సుందర్ లాల్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ రమేశ్, సింగరేణి అధికారులు అతని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సెల్ టవర్ దిగాలని నచ్చజెప్పారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా
సింగరేణి సంస్థ(Singareni coal mining) నుంచి నష్ట పరిహారం అందలేదనే ఆవేదనతో గత కొంతకాలంగా సుందర్.. పట్టణంలో అతను వేసుకున్న దుస్తులపై వివరాలు రాసుకొని తిరిగారు. తన సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని పాదయాత్రగా గతంలో హైదరాబాద్ కూడా వెళ్లారు. కానీ అక్కడ పోలీసు అధికారులు అతనికి నచ్చచెప్పి తిరిగి ఇంటికి పంపించారు. సింగరేణి పర్యావరణ అభిప్రాయసేకరణలో సైతం అతను నిరసన వ్యక్తం చేసి తనకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం కలెక్టర్‌తో తన సమస్యను విన్నవించారు. బాధితుడు వ్యక్తం చేస్తున్న సమస్య ఇటు సింగరేణి(Singareni coal mining) అధికారులకు, మరోవైపు జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టవర్ పైనే ఉండి.. అక్కడి వారిని భయాందోళనకు గురి చేశారు.
పలుమార్లు విజ్ఞప్తి చేయగా
తండ్రి ఆవేదనతో సెల్ టవర్(cell tower) ఎక్కడంతో కుమారుడు, అతని కుటుంబసభ్యులు బోరున విలపించారు. సుందర్ కుమారుడు.. కొద్ది సేపటికి సొమ్మసిల్లి పడిపోయాడు. అధికారులు కుటుంబ సభ్యులను వారిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సుందర్‌కు నచ్చజెప్పారు. సింగరేణి అధికారులు, పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేయగా సాయంత్రం 5 గంటలకు టవర్ దిగారు. పోలీసులు, రెవెన్యూ, సింగరేణి, రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ అధికారులు అతడు సురక్షితంగా కిందకు దిగేందుకు కృషి చేశారు. ఆర్డీవో స్వర్ణలత ఘటనా స్థలానికి చేరుకొని సోమవారం మాట్లాడేందుకు రావాలని బాధితుడికి సూచించారు. గతంలో వివిధ సమస్యల పట్ల కూడా పలువురు సెల్ టవర్ ఎక్కిన సందర్భం ఇల్లందులో చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: Minister Niranjan Reddy : నల్ల చట్టాలతో రైతులను వంచించే కేంద్రానికి.. ఆ శక్తి లేదా?