గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్లోని కర్మన్‌ఘాట్ గోరక్షక సేవాసమితి సభ్యులు.. టీకేఆర్ కమాన్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వాహనాలు దెబ్బతినడంతో పాటు, గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. గోరక్షకుల నుంచి తప్పించుకునేందుకు తరలింపుదారులు దగ్గరలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు. వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ యువకులు రాత్రంతా నిరసన చేపట్టారు. తమపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను గోసంరక్షకులు డిమాండ్ చేశారు.
మంగళవారం(ఫిబ్రవరి 22) రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఆందోళన.. తెల్లవారుజామున(ఫిబ్రవరి 23) 3 గంటల వరకు సాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురిని అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు. ఆగ్రహానికి గురైన యువత పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టి, మెజార్టీ యువకులను అరెస్టు చేసి మీర్పేట్, సరూర్నగర్ పీఎస్‌లకు తరలించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేంత వరకు తాము ఊరుకోబోమని ఆందోళనను కొనసాగిస్తామని గోరక్షక సేవ సమితి సభ్యులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: